కొమురవెల్లి మలన్న క్షేత్రంలో రూ. 12 కోట్లతో క్యూలైన్‌ కాంప్లెక్స్‌..

-  శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్‌ రావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశారని, ఇప్పుడది తెలంగాణకు కల్పతరువుగా మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మల్లన్న సాగర్‌ జలాశయాన్ని ప్రారంభించి.. ఆ గోదావరి జలాలతో తెచ్చి మల్లన్నకు కాళ్లు కడిగి మెక్కులు చెల్లించుకున్నారని చెప్పారు. ఈ సంవత్సరం ఇంకా కాలంకాకున్నా మల్లన్న దేవుడి ఆశీస్సులతో వర్షం కోసం ఎదురు చూపులు చూడకుండా కాళేశ్వరం ద్వారా వచ్చే జలాలు ఉన్నాయని రైతులు ధైర్యంగా, నమ్మకంతో నారు పోశారన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మల్లన్న క్షేత్రంలో రూ.12 కోట్ల వ్యయంతో చేపట్టిన క్యూ లైన్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మల్లన్న దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. మొక్కు తీర్చుకొనేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీమేరకు రాజీవ్ రహదారి నుంచి ఆలయానికి వచ్చేలా రూ.10.30 కోట్లు నిధులతో డబుల్ లేన్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు ఉండేవి కావని మంత్రి అన్నారు. దేవాలయ అభివృద్ధికై రూ.36 కోట్లు వెచ్చించి వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టినట్లు వెల్లడించారు. మల్లన్న కల్యాణోత్సవంలో ఇచ్చిన హామీ మేరకు స్వామివారికి బంగారు కిరీటం, వెండి తలుపులు, వెండి ముఖద్వారాలు చేయించినట్లు తెలిపారు. ఆలయ ఆవరణలోని గుట్టపై 100 గదులతో సత్రాలు త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నామని చెప్పారు. గతంలో మల్లన్న క్షేత్రానికి రూ.4 నుంచి 5 కోట్లు ఆదాయం మాత్రమే వచ్చేదని, కానీ ఇప్పుడు రూ.18 కోట్ల మేర ఆదాయం వస్తున్నదని మంత్రి వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.