తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు

...కేంద్రానికి సుప్రీం నోటీసులు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్ : రెండు తెలుగు రాష్ట్రాలలో విభజన చట్టానికి లోబడి సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉండగా గత ఎనిమిదిన్నర ఏళ్ళుగా కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని అదే 2019లో జమ్మూ కాశ్మీర్ ని విభజించిన  నేపధ్యంలో అక్కడ సీట్ల పెంపు  కోసం డీ లిమిటేషన్ కమిటీని వేసిందంటూ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీం కోర్టులో గురువారం  విచారణ జరిగింది.
ఈ సందర్భంగా కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయం మీద నాలుగు వారాల లోగా కేంద్రం సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ ఈ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఈ పిటిషన్ ని సెప్టెంబర్ నెలలోనే విచారణకు సుప్రీం కోర్టు స్వీకరించింది. న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్ జస్టిస్ హృషికేశ్ రాయ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసుని విచారిస్తోంది.ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఏపీలో ఉన్న 175 సీట్లను 225గా పెంచాలని అలాగే తెలంగాణాలో ఉన్న 119 సీట్లను 153కి పెంచాలని ఉంది. అయితే కేంద్రం వాదన వేరేగా ఉంది. 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగానే నియోజక వర్గాలను పునర్వ్యవస్థీకరించాలన్న సీలింగ్ ఉందని కేంద్రం చెబుతూ వస్తోంది. పైగా సీట్ల పెంపు చేయాలీ అంటే రాజ్యాంగ సవరణ చేయాలని కూడా అంటోంది.
అయితే ఏపీని రెండుగా విభజించి  పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదించినపుడే రాజ్యాంగం ఆమోదం లభించిందని వేరేగా సీట్ల పెంపునకు అవసరం లేదని తెలుగు రాష్ట్రాలు వాదిస్తూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలైన అసోం మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ నాగాలాండ్ లను కలుపుకుని నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ఒక నోటిఫికేషన్ని కేంద్ర న్యాయ శాఖ ఇచ్చేసింది. దానికి ఎలాంటి అవాంతరాలు లేనపుడు తెలుగు రాష్ట్రాలకే ఎందుకు అంటూ ఈ పిటిషన్ దాఖలైంది.
అంతే కాదు ఈ రకమైన వివక్ష చూపడం రాజ్యాంగంలోని  14 19 21వ అధికరణలను ఉల్లఘించడమే అని కూడా పిటిషనర్ తరఫున న్యాయవాది రావు రంజిత్ వాదించారు. ఇప్పటిదాకా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయకపోవడం కంటే జాప్యం వేరేది ఉండదని అంటున్నారు. దీంతో సుప్రీం కోర్టు కేంద్రానికే ఈ విషయం మీద జవాబు చెప్పమని కోరింది.మరి కేంద్రం ఇపుడు ఏం చేస్తుంది అన్నదే చర్చగా ఉంది. నిజానికి తెలనగాణాలో చూసుకుంటే ప్రస్తుతం ఉన్న 119 సీట్లలోనే బీజేపీకి అభ్యర్ధులు పూర్తిగా లేరు. దాన్ని 153 చేస్తే అధికార టీయారెస్ కి లాభం తప్ప బీజేపీకి ఎంతమాత్రం కాదు అలాగే ఏపీలో అసలే ఉనికి పోరాటాన్ని బీజేపీ చేస్తోంది. దాంతో మరిన్ని ఏళ్ళు ఈ డీ లిమిటేషన్ని వాయిదా వేయాలన్నదే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎత్తుగడ అని అంటున్నారు.కానీ ఈ కేసు ఇపుడు సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది. పైగా జమ్మూ కాశ్మీర్ సహా ఈశాన్య రాష్ట్రాలలో నియోజకవర్గాల  పునర్వ్యవస్థీకరణకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాశ్మీర్ లో అయితే డీ లిమిటేషన్ కమిటీ ఏర్పాటు అయింది. దాంతో కేంద్రం ఇపుడు ఏమి చెప్పి దీని నుంచి తప్పించుకుంటుంది అన్నదే చర్చకు వస్తోంది. కేంద్రం కనుక ఎస్ అంటే రెండు రాష్ట్రాలలో సీట్ల పెంపు ఈసారి జరిగే శాసనసభ ఎన్నికల కంటే ముందే జరిగిపోతుంది.  అయితే కేంద్రం నో చెప్పడానికి  అసలు కుదరదని చాలా అభ్యంతరాలే కోర్టు ద్వారా ఎదురవుతాయని అంటున్నారు. మొత్తానికి కేంద్రం సీట్లను పెంచాల్సిందే అన్నదే చర్చగా ముందుకు వస్తోంది మరి.

Leave A Reply

Your email address will not be published.