ఈ సారి మిస్‌ వరల్డ్‌ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఫ్యాషన్‌ ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మిస్‌ వరల్డ్‌ పోటీలకు ఈ సారి భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ పోటీలు భారత్‌లో జరగబోతున్నాయి. తుది తేదీలు ఇంకా ఖరారు కానప్పటికీ.. 71వ మిస్‌ వరల్డ్‌ పోటీలు నవంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ చైర్‌ పర్సన్‌, సీఈవో జూలియా మోర్లీ వెల్లడించారు.‘ఈ ఏడాది నవంబర్‌లో 71వ ప్రపంచ సుందరి పోటీలు ఇండియాలో జరగబోతున్నాయని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నా. ఎన్నో ప్రత్యేకతలు, విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న భారత్‌లో ఈ పోటీలు నిర్వహించేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అని జూలియా వెల్లడించారు. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ ప్రపంచ సుందరి పోటీల్లో 130కిపైగా దేశాల నుంచి అభ్యర్థులు పాల్గొంటారు.భారత్‌లో చివరిగా 1996లో మిస్‌ వరల్డ్‌ పోటీలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు మన దేశంలో ప్రపంచ సుందరి పోటీలు జరగనుండటం విశేషం. కాగా, భారత్‌ ఇప్పటి వరకూ ఆరుసార్లు మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని దక్కించుకుంది. 1966 ఏడాదిలో రీటా ఫరియా మొదటి సారి భారత్‌ నుంచి మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని అందుకుంది. ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌ (1994), డయానా హైడెన్‌ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంక చోప్రా(2000), మానుషి చిల్లర్‌ (2017) విశ్వ సుందరి కిరీటాలను దక్కించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.