భారత వాయు సేన సిబ్బంది నూతన కంబాట్ యూనిఫాం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత వాయు సేన సిబ్బంది నూతన కంబాట్ యూనిఫాంలో కనిపించబోతున్నారు. ఈ యూనిఫాంను ఐఏఎఫ్ 90వ వార్షికోత్సవాల సందర్భంగా శనివారం ఆవిష్కరించారు. పిక్సెలేటెడ్ డిజైన్స్‌తో అన్ని ప్రాంతాలకు తగినట్లుగా దీనిని రూపొందించారు. దీనిని డిజిటల్లీ కెమఫ్లేజ్‌డ్ యూనిఫాం అంటారు. ఈ యూనిఫాం ఫస్ట్ లుక్‌ను ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి శనివారం ఆవిష్కరించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది కోసం దీనిని రూపొందించారు. పిక్సెలేటెడ్ డిజైన్స్‌తో అన్ని ప్రాంతాలకు తగినట్లుగా దీనిని రూపొందించారు. పర్వత ప్రాంతాలు, ఎడారులు, మంచుతో కూడిన ప్రాంతాలలో ఈ యూనిఫాంలు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయని వింగ్ కమాండర్ అశిష్ మోఘే చెప్పారు. ఈ కొత్త యూనిఫాంను మన దేశంలోనే తయారు చేసినట్లు తెలిపారు. స్వయంసమృద్ధ భారత దేశం ఎజెండాను ఇది బలోపేతం చేస్తుందన్నారు. వేర్వేరు నగిషీ (డిజైన్)లను అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాత కెమఫ్లేజ్ ప్యాటర్న్ నుంచి డిజిటల్ ప్యాటర్న్‌కు మారాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇది టక్ ఇన్ యూనిఫాం కాదన్నారు. లోపల రౌండ్ నెక్ టీ-షర్ట్ ఉంటుందని చెప్పారు. టార్మాక్‌పై పని చేసేవారు ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి టీ-షర్ట్ ధరించి పని చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. పంజాబ్‌లోని చండీగఢ్‌లో ఐఏఎఫ్ 90వ వార్షికోత్సవాల సందర్భంగా చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వీఆర్ చౌదరి మాట్లాడుతూ, ఐఏఎఫ్ అధికారుల కోసం వెపన్ సిస్టమ్ బ్రాంచ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. దీనిలో ఉపరితలం నుంచి ఉపరితలానికి, ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే క్షిపణుల వ్యవస్థలు ఉంటాయన్నారు. దీనివల్ల రూ.3,400 కోట్లు ఆదా అవుతాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.