మోదీ పాలనలో మెరుగైన స్థితిలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ

- ప్రత్యక్ష నగదు బదిలీ విధానం అంతర్జాతీయ సమాజానికి నమూనాగా నిలిచిండి - దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురువారం లోక్ సభలో వివరించారు. ‘వస్తాయి, అందుతాయి’ అని ప్రజలు గత ప్రభుత్వాల హయాంలో ఆశించేవారని, ప్రస్తుతం ‘వచ్చాయి. అందాయి’ అని ప్రజలు అంటున్నారని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ప్రజలు ‘విద్యుత్తు వస్తుంది, వంటగ్యాస్ కనెక్షన్ వస్తుంది’ అని ఎంతో ఆశతో చూసేవారని, ప్రస్తుతం విద్యుత్తు వచ్చింది, వంటగ్యాస్ కనెక్షన్ వచ్చింది అని ప్రజలు చెప్తున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆమె మాట్లాడారు.2013లో యూపీయే ప్రభుత్వం ఉన్నపుడు ప్రముఖ రేటింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ భారత దేశాన్ని ప్రపంచంలో బలహీన ఆర్థిక వ్యవస్థలుగల ఐదు దేశాల్లో ఒకటిగా వర్గీకరించిందని చెప్పారు. కానీ ప్రస్తుత మోదీ పాలనలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉందని చెప్తూ, భారత దేశ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసిందన్నారు. కేవలం తొమ్మిదేళ్లలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిందని, దీనికి కారణం ప్రభుత్వ విధానాలేనని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, దేశం ఆర్థికంగా వృద్ధి సాధిస్తోందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచిందని చెప్పారు. భవిష్యత్తులో అభివృద్ధి సాధించడం గురించి మన దేశం ఆశాజనక స్థితిలో ఉందన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022లో కేవలం 3 శాతం వృద్ధి సాధించిందని, 2023లో ఇది 2.1 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసిందని చెప్పారు. ‘‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి నమ్మకం, అందరి కృషి’’ అనే నినాదంతో మోదీ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇటువంటివాటి ద్వారా ఆర్థిక విధానాలను మోదీ మెరుగుపరిచారని చెప్పారు. కోవిడ్ మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి, వేగంగా వృద్ధి చెందడానికి ఇవన్నీ దోహదపడ్డాయన్నారు.ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) విధానం అంతర్జాతీయ సమాజానికి నమూనాగా నిలిచిందని చెప్పారు. 2013-14లో కేవలం రూ.7,367 కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు చేరాయని, 2014-15నాటికి ఇది ఐదు రెట్లు పెరిగిందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.7.16 లక్షల కోట్లకు పెరిగినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.