ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌కు ఇంటర్నేష‌న‌ల్ క్రిమిన‌ల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి ల‌క్ష‌లాదిమంది ప్రాణాలు బ‌లిగొంటున్న‌ ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు షాక్‌.. ది హేగ్‌లోని ఇంటర్నేష‌న‌ల్ క్రిమిన‌ల్ కోర్టు (ఐసీసీ) అత‌నిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ‘ఉక్రెయిన్‌లో జ‌రుగుతున్న‌యుద్ధానికి పుతిన్ బాధ్యుడు. అంతేకాదు ఆ దేశంలో ఆక్ర‌మించుకున్న ప్రాంతాల నుంచి అక్క‌డి ప్ర‌జ‌ల‌ను.. ముఖ్యంగా పిల్ల‌ల‌ను ర‌ష్యాకు అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న యుద్ధ నేరస్థుడు పుతిన్’ అంటూ ఐసీసీ తన అరెస్ట్ వారెంట్‌లో పేర్కొంది.ఉక్రెయిన్ పిల్ల‌ల‌ను అక్ర‌మంగా ర‌ష్యాకు త‌ర‌లిస్తున్నందుకు ర‌ష్యా పిల్ల‌ల హ‌క్కుల క‌మిష‌న‌ర్ మ‌రియా అలెక్సేఎవ్నా వోవా బెలోవాపై కూడా ఐసీసీ న్యాయ‌మూర్తులు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. అంతేకాదు ఉక్రెయిన్‌లో జ‌రుగుతున్న న‌ర‌మేధానికి ర‌ష్యా అధ్యక్షుడే కార‌ణం అన‌డానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయ‌ని అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం తెలిపింది.ఇంట‌ర్నేష‌నల్ క్రిమిన‌ల్ కోర్టు మొద‌ట‌గా పుతిన్, మ‌రియాపై ర‌హ‌స్యంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయాల‌నుకుంది. అయితే.. వాళ్ల‌పై బ‌హిరంగంగా అరెస్ట్ వారెంట్ ఇస్తే, మ‌రిన్ని నేరాల‌ను అదుపులో పెట్ట‌వ‌చ్చ‌నే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు న్యాయ‌మూర్తులు వెల్ల‌డించారు.

స్వాగ‌తించిన ఉక్రెయిన్

ర‌ష్యా విదేశాంగ శాక మీడియా ప్ర‌తినిధి మ‌రియా జ‌ఖ‌రోవా మాత్రం అరెస్ట్ వారెంట్‌ను కొట్టిపారేశారు. ‘అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం నిర్ణ‌యం త‌మ దేశానికి ఏమాత్రం వ‌ర్తించ‌ద‌ని, న్యాయ‌ప‌రంగానూ అది చెల్ల‌ద‌’ని మ‌రియా త‌న టెలిగ్రామ్ ఛానెల్‌లో తెలిపారు. మ‌రోవైపు ఉక్రెయిన్ అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం నిర్ణ‌యాన్ని స్వాగ‌తించింది. ‘ఇది ఆరంభం మాత్ర‌మే’ అని ఉక్రెయిన్ అధ్య‌క్షుడి మ‌ఖ్య అధికారి ఒక‌రు సోష‌ల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. 2022 ఫిబ్ర‌వరి 24 ర‌ష్యా, ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన విష‌యం తెలిసిందే. ఈ వార్ కార‌ణంగా.. ఇరుదేశాలకు చెందిన సైనికులు లక్ష‌ల్లో ప్రాణాలు కోల్పోయారు. ల‌క్ష‌లాది మంది ఉక్రెయిన్ ప్ర‌జ‌లు ప్రాణాలు అర‌చేత ప‌ట్టుకుని పొరుగు దేశాల‌కు వ‌ల‌స వెళ్లారు.

Leave A Reply

Your email address will not be published.