వీర్యం, అండం లేకుండానే పిండాన్ని సృష్టించిన ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. స్త్రీ, పురుషుల కలయికతో సంబంధం లేకుండానే పిండాన్ని సృష్టించారు. ఒక జీవి ప్రాణం పోసుకోవాలంటే అండం, శుక్రకణం తప్పనిసరి. ఏవో కొన్ని ఏకకణ జీవుల్లో మాత్రమే ఇందుకు మినహాయింపు. మనిషి పుట్టుకకు మాత్రం అండం, శుక్రకణం తప్పక కలవాల్సిందే. కానీ, ఇకపై వాటితో అవసరం లేకుండానే పిల్లలను పుట్టించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. జీవకణంతో మానవ పిండాన్ని సృష్టించారు. అదికూడా మహిళ గర్భంలో కాకుండా ప్రయోగశాలలో సృష్టించటం విశేషం. రెహోవొత్‌లోని వీజ్‌మన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన పరిశోధకుల బృందం ఈ విప్లవాత్మక ఆవిష్కరణ చేసింది. మనిషి మూలకణాన్ని ఉపయోగించి అచ్చం మానవ పిండాన్ని పోలిన ఆకారాన్ని వారు సృష్టించారు. ఈ పిండం ప్రయోగశాలలో 14 రోజులపాటు పెరిగింది. తల్లిగర్భంలో పిండం రూపుదాల్చే ప్రారంభ దశలో ఎలా ఉంటుందో ఈ కృత్రిమ పిండం కూడా అచ్చం అలాగే ఉన్నదని పరిశోధకులు తెలిపారు.

 

1 శాతమే సఫలమైనా…

 

సాధారణంగా గర్భం దాల్చినప్పుడు మొదటి నెలలోనే సమస్యలు తలెత్తుతాయి. ఆ సమయంలోనే గర్భవిచ్ఛిత్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అసలు ఆ సమయంలో పిండం పెరుగుదల ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఇజ్రాయెల్‌ పరిశోధకులు అనుకున్నారు. పరిశోధకులు మొదట ఎలుకలపై ఈ అధ్యయనం చేసి సఫలం అయ్యారు. అనంతరం ప్రయోగశాలలో పిండం రూపొందించేందుకు పూనుకున్నారు. మూలకాణాలను సేకరించి వాటిపై పరిశోధనలు చేశారు. ఓ కణం పిండంగా మారాలంటే ప్లాసెంటా, మెంబ్రెన్‌, యోల్క్‌ శాక్‌, అమ్నియోటిక్‌ శాక్‌ తదితరాలు అవసరమవుతాయి. దీని కోసం మూలకణానికి ముందుగానే పిండంగా మారేలా ప్రోగ్రామింగ్‌ చేశారు. మూల కణం పిండంగా మారేందుకు నాలుగు రకాల కణాలను రసాయనాలను ఉపయోగించి ప్రేరేపితం చేశారు. వాటిలో మొదటిది ఎపిబ్లాస్ట్‌ కణాలు. ఇవి పిండంగా మారేందుకు అవసరమవుతాయి. రెండోది ట్రోపోబ్లాస్ట్‌ కణాలు.. ఇవి ప్లాసెంటాను ఉత్పత్తి చేస్తాయి. మూడోది హైపోబ్లాస్ట్‌ కణాలు.. ఇవి పిండానికి అవసరమైన యోల్క్‌ శాక్‌ (పొర)ను రూపొందించేందుకు దోహదపడతాయి. నాలుగోది మెస్మోడెర్మ్‌ కణాలు.. ఇవి అమ్నియోటిక్‌ శాక్‌గా రూపాంతరం చెందుతాయి. అయితే 120 రకాల కణాలను పరస్పరం మిక్స్‌డ్‌ చేయగా.. వాటిలో 1 శాతం మాత్రమే సఫలమై పిండంగా రూపాంతరం చెందింది. అనంతరం మానవుల తరహాలోనే గర్భధారణ పరీక్ష చేసేందుకు వీలుగా హార్మోన్‌ను సైతం ఈ పిండం విడుదల చేసినట్టు పరిశోధకులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.