జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి వస్తే చాలు        

- ఎడారిని తలపిస్తున్న చుట్టు పక్కల ప్రాంతాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి వస్తే చాలు చుట్టు పక్కల ప్రాంతాలన్నీ ఎడారిని తలపిస్తున్నాయ్..! కొన్ని కిలోమీటర్ల మేర ఎక్కడా వాహనాలు, మనుషులే కాదు.. ఆఖరికి చెట్లు గట్రా కూడా కనిపించకుండా చేసేస్తున్నారు అధికారులు..!. ఒక్క ఏపీలోనే ఈ పరిస్థితి ఉందా లేకుంటే మరెక్కడైనా సీఎం బయటికి వస్తే ఈ పరిస్థితులు అంటారా.. బహుశా ఏపీలో తప్ప మరెక్కడా ఈ పరిస్థితులు చూసి ఉండరేమో.. అదే జగన్ రెడ్డి స్పెషాలిటీ అంటే అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. జగన్ కాన్వాయ్‌లో వచ్చారంటే ఎక్కడికక్కడ వాహనాలు ఆపేస్తారంటే దానికో లెక్కుంది.. మరి ఫ్లైట్‌లో వెళ్లినా ఇదే పరిస్థితి ఎందుకనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇంతకీ జగన్ బయటికొస్తే పదే పదే ఎందుకీ పరిస్థితి వస్తోంది..? అసలు సీఎం ఎందుకింత అభద్రతగా భావిస్తున్నారు..?

జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటే సరే.. బయటికొచ్చారంటే ఇక కనుచూపు మేరల్లో పోలీసులు తప్ప జనాలు గానీ, షాపులు తెరిచివున్నట్లుగానీ కనీసం ఎక్కడా వాహనాలు కూడా కనిపించడకూడదు.. ఇదీ ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న ఓవరాక్షన్. ఇక్కడి వరకూ సరిపెట్టుకున్నారంటే సరే.. జగన్ వెళ్లే దారుల్లో రోడ్డుకు అటు వైపు.. ఇటువైపు కనీసం డివైడర్ల మధ్యలో కూడా చెట్లు కనిపించకుండా చేసేస్తున్నారు అధికారులు. ఇదీ మరీ ఎక్కువ అనిపించినప్పటికీ అక్షరాలా నిజమే. ఇందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. విశాఖలో జగన్ పర్యటిస్తున్నారని పట్టణంలోని చినముషిడివాడ జంక్షన్ నుంచి శారదాపీఠం వెళ్లే రోడ్డు డివైడర్‌పై ఉన్న చెట్లు.. గుంటూరు జిల్లా మంగళగిరిలో జగన్ పర్యటనకు ఉండగా రోడ్లకు ఇరువైపులా ఏళ్ల తరబడి ఉన్న వృక్షాలను నరికేశారు. ఆఖరికి నిడదవోలులో ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ వేడుకకు వెళ్లగా పచ్చగా కళకళలాడిన చెట్లను నరికించేశారు అధికారులు. ఎందుకిలా చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే.. సీఎం భద్రతలో భాగంగా అని సదరు అధికారులు చెబుతుండటాన్ని చూసి జనాలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. జగన్ రోడ్డు మార్గాన వెళ్తున్నారు కాబట్టి ఈ పరిస్థితులు ఉన్నాయంటే సరే.. కానీ ఫ్లైట్‌లో వెళ్లినా కూడా ఇంతకంటే ఘోరంగా పరిస్థితులు నెకొనడం దారుణాతి దారుణం.

సీఎం హెలికాప్టర్‌లో వెళుతుంటే… కింద రోడ్ల మీద వాహనాలు ఆపడాన్ని ఏమంటారు? ‘కితకితలు’ పెట్టడమంటారు! మన పోలీసులూ ఇదే చేశారు. ఎక్కడో భోగాపురంలో ముఖ్యమంత్రి జగన్‌ కార్యక్రమం ఉండగా… అక్కడికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాసలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేశారు. అదికూడా… సీఎం నేరుగా హెలికాప్టర్‌లో భోగాపురం వెళ్లి, హెలికాప్టర్‌లోనే తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన కాన్వాయ్‌ రోడ్డు ఎక్కిందే లేదు.. అయినా సరే వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించడం గమనార్హం. అదికూడా.. భోగాపురానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారిని దాదాపు 4 గంటలపాటు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఖాకీలు. దీంతో ట్రాఫిక్‌ మూడు కిలోమీటర్ల మేర స్తంభించిపోయింది. లారీల డ్రైవర్లు, సిబ్బంది నీరు, ఆహారం కోసం నానా ఇబ్బందులు పడ్డారు. ఇంత జరుగుతున్నా జగన్ వీటిపై ఎలాంటి దృష్టి పెట్టకపోవడం సిగ్గుచేటని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీనిపైన సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున మీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా సీఎం జగన్ గురించే తెగ చర్చించుకుంటున్నారు. అదేదో సినిమాలో సన్నివేశాన్ని జగన్‌కు జతచేసి మీమర్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.

జగన్ నివాసముండే పరిసరప్రాంతాల్లో.. ఆయన పయనించే దారుల్లో రాష్ట్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు నివాసం ఉంటున్నారు. అయితే రైతులు ఏ క్షణమైనా దాడి చేయొచ్చన్నది వైసీపీ వర్గాలు చెబుతున్న మాట. అందుకే జగన్‌ను ఇంత భద్రత నడుమ తీసుకెళ్తున్నట్లు అధికార పార్టీ చెబుతుంటుంది. ఒక్క.. తాడేపల్లిలోనే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటించినా ఇదే పరిస్థితులు నెలకొనడం దేనికి సంకేతం అన్నది తెలియని కథ. ఇలా చేయండని జగన్ చెబుతున్నారో లేకుంటే అధికారులే అత్యుత్సాహం, ముందు జాగ్రత్తలతో ఇలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కాని విషయం. ఇప్పటికే జగన్ కాన్వాయ్‌లో వెళ్తుంటే ఎక్కడికక్కడ పరాదాలు కట్టడంతో ‘పరదాల సీఎం’ అంటూ హడావుడి చేసిన ప్రతిపక్షాలు, నెటిజన్లు.. ఇప్పుడు ఫ్లైట్‌లో వెళ్తుంటే ఇలా ట్రాఫిక్‌ను ఆపడంపై జనాలు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో మరి.

Leave A Reply

Your email address will not be published.