ప్రజల సమస్యల పరిష్కారం కోసం జగనన్న సురక్ష కార్యక్రమం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టామని, 11 రకాల ధృవపత్రాలను ఇంటింటికీ వెళ్లి అందిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మంత్రి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ 99.5 శాతం సంక్షేమ ఫలాలు అందించారని, నూటికి నూరు శాతం లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించాలన్నదే జగన్ ఉద్దేశమన్నారు. ప్రజలను జల్లెడ పట్టి వారి సమస్యలను గుర్తించి సిబ్బంది పరిష్కరిస్తారన్నారు. కార్యక్రమం పర్యవేక్షణకు 26 జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారన్నారు. 5 కోట్లకు పైగా ప్రజలకు 1.60 కోట్ల కుటుంబాలను కలసి సమస్యలను గుర్తిస్తారని, జగనన్న సురక్ష కార్యక్రమాన్ని వందకు వంద శాతం విజయవంతం చేయాలని సీఎం ఆదేశించారన్నారు. వాలంటీర్లు, గృహ సారథులు ఇంటింటికీ వెళ్లి యాప్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు.

పవన్ కళ్యాణ్‌పై మంత్రి అదిమూలపు సురేష్ కామెంట్స్..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్‌పై, ప్రభుత్వంపై పిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి అదిమూలపు సురేష్ మండిపడ్డారు. 5.30 కోట్ల కుటుంబాలకు అభివృద్ది సంక్షేమం అందిందా లేదా అని సీఎం చూస్తున్నారని, చివరి అవకాశం అని ఒకరు, ఒక అవకాశం అని మరొకరు వస్తున్నారని విమర్శించారు. జగన్‌కు ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని, కేంద్రానికి పవన్ ఇచ్చిన స్క్రి ప్టు ప్రకారం వారు కూడా ఇలాగే మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో అవినీతి జరిగిందని అంటున్న వారు దాన్ని నిరూపించాలని మంత్రి అదిమూలపు సురేష్ సవాల్ చేశారు. ఎస్సీలకు 25 స్కీంలు ఎత్తివేశారని పవన్ ఆరోపణలు చేశారని, దీనిపై త్వరలో వైట్ పేపర్‌ను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఎస్సీల కోసం ప్రభుత్వం ప్రతి పథకాన్ని ఎలా అమలు చేస్తుందో చెబుతామని, ఎస్సీలకు సబ్ ప్లాన్ సహా పలు పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని తాము అమలు చేస్తున్నామని, విజయవాడ నడి బొడ్డున అంబేద్కర్ భారీ విగ్రహాన్ని నిర్మిస్తున్నామని మంత్రి అదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.