జగన్ మూర్ఖత్వం, అహంభావం పోలవరం నిర్మాణానికి శాపాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం జగన్ రెడ్డి మూర్ఖత్వం, అహంభావం పోలవరం నిర్మాణానికి శాపాలుగా మారాయని, పోలవరం నిలిచిపోవడానికి ప్రధానకారకుడు ముఖ్యమంత్రేనని టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి షెకావత్  వ్యాఖ్యలపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో పోలవరంలో జరుగుతున్న పనుల్ని రద్దు చేయవద్దని, కొత్త ఏజెన్సీలను పెట్టవద్దని పీపీఏ కేంద్ర ప్రభుత్వం చెప్పినా జగన్ రెడ్డి మూర్ఖత్వంతో ముందుకెళ్లారని విమర్శించారు. కొత్త సంస్థలకు పనులు అప్పగిస్తే, జరిగే తప్పిదాలకు ఎవరు బాధ్యత వహిస్తారన్న కేంద్ర ప్రభుత్వ ప్రశ్నకు ముఖ్యమంత్రి నోరెత్తలేదన్నారు.కమీషన్లకు ఆశపడి, పోలవరం పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడారని దేవినేని ఉమ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో పోలవరంలో జరిగిన ప్రతిపనికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించిందని, జగన్ వచ్చాక ఎంతమేరపనులు జరిగితే ఎన్నికోట్లు ఇచ్చిందని ప్రశ్నించారు. పోలవరంలో కుంగింది గైడ్ బండ్ కాదని, జగన్ రెడ్డి పరువు ప్రతిష్టలు జారాయన్నారు. తండ్రి విగ్రహం పెట్టడానికి రూ.350 కోట్లు కేటాయించిన జగన్ రెడ్డి, నిర్వాసితులకు నాలుగేళ్ల లో రూ.3 కోట్లు కేటాయించలేదని విమర్శించారు. తన బతుకు, బండారం బయటపడుతుందనే జగన్ రెడ్డి పోలవరం చూడటానికి ఎవరినీ అనుమతించడంలేదన్నారు.నాలుగేళ్లలో పోలవరం సహా, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన ప్రగతిని జగన్ రెడ్డి ప్రజలకు చెప్పగలరా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. ప్రధాని, కేంద్ర మంత్రుల్ని కలిశాక, ఢిల్లీలో మీడియాతో మాట్లాడటానికి జగన్ రెడ్డికి ఎందుకంత భయమన్నారు. పోలవరం డీపీఆర్-2ని 49 నెలలుగా కేంద్రంతో ఆమోదింపచేయించుకోకుండా జగన్ రెడ్డి గడ్డిపీకుతున్నారా? అని నిలదీశారు. ఇసుక అమ్ముకోవడానికి ప్రాజెక్టులు, డ్యామ్‌లను గాలికివదిలేసిన దుర్మార్గుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. రూ.1500 కోట్లు తన మనుషులైన ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు దోచిపెట్టి, ఆ సొమ్ముని వచ్చేఎన్నికల్లో వినియోగించు కోవడానికి జగన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారన్నారు. 4 ఏళ్లలో రాష్ట్రంలో ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేసి, ఎకరాకు నీరివ్వని దద్దమ్మలు పోలవరాన్ని పూర్తిచేస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. బుల్లెట్లు దించుతానన్న అనిల్ కుమార్ పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారన్నారు. పులిచింతల డ్యామ్‌కు గేటు బిగించలేని సంబరాల రాంబాబుకు పోలవరంపై మాట్లాడే అర్హతలేదని దేవినేని ఉమ్మ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.