2024లో జ‌మిలి ఎన్నిక‌ల వ్య‌వ‌స్ధ సాధ్యం కాదు

:లా క‌మిష‌న్ వ‌ర్గాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 2024లో జ‌మిలి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోవ‌ని లా క‌మిష‌న్ వ‌ర్గాలు శుక్ర‌వారం పేర్కొన్నాయి. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల లోపు ఒకే దేశం ఒకే ఎన్నిక‌ల వ్య‌వ‌స్ధ సాధ్యం కాద‌ని లా క‌మిష‌న్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. జ‌మిలి ఎన్నిక‌ల‌పై లా క‌మిష‌న్ నివేదిక 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల లోగా ప్ర‌చురించే అవ‌కాశం ఉంద‌ని లా క‌మిష‌న్ చైర్మ‌న్ జ‌స్టిస్ రుతురాజ్ అవ‌స్ధి ఇటీవ‌ల వెల్ల‌డించారు. ఏక‌కాల ఎన్నిక‌ల‌పై క‌స‌రత్తు ఇంకా జ‌రుగుతున్నందున నివేదిక ప‌నులు ఇంకా కొన‌సాగుతున్నాయ‌ని చెప్పుకొచ్చారు.దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌కు అవ‌స‌ర‌మైన రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ల‌ను ఈ నివేదిక ప్ర‌భుత్వానికి సూచిస్తుంద‌ని చెబుతున్నారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో 22వ లా క‌మిష‌న్ జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌తిపాద‌న‌పై జాతీయ రాజ‌కీయ పార్టీలు, ఈసీ, అధికారులు, విద్యావేత్త‌లు, నిపుణుల అభిప్రాయాలు కోరేందుకు ఆరు ప్ర‌శ్న‌ల‌ను రూపొందించింది.ఇక జ‌మిలిపై క‌స‌ర‌త్తు అనంత‌రం 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోగా లా క‌మిష‌న్ త‌న నివేదిక‌ను సిద్ధం చేసి కేంద్ర న్యాయ‌మంత్రిత్వ శాఖకు స‌మ‌ర్పిస్తుంద‌ని భావిస్తున్నారు. లోక్‌స‌భ‌తో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఒకేసారి నిర్వ‌హించ‌డం ద్వారా ప్ర‌జా ధనాన్ని ఆదా చేయ‌డంతో పాటు నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్ధ‌, భ‌ద్ర‌తా ద‌ళాలపై భారాన్ని త‌గ్గించ‌వ‌చ్చ‌ని, ప్ర‌భుత్వ ప‌ధ‌కాలు, విధానాలను మెరుగ్గా అమ‌లు చేయ‌వ‌చ్చ‌ని 2018లో 21వ లా క‌మిష‌న్ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ‌కు అంద‌చేసిన ముసాయిదా నివేదిక‌లో పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.