జమ్ము కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం

ఐరాస సభలో పాక్ పై భగ్గుమన్న భారత్

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను ఖాళీ చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలని పాకిస్థాన్‌కు భారత్‌ పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) సదస్సులో పాక్‌కు వ్యతిరేకంగా ఘాటుగా వ్యాఖ్యానించింది. అమెరికాలోని న్యూయర్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 78వ సదస్సులో పాకిస్థాన్‌ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. ఈ నేపథ్యంలో యూఎన్‌లో భారత్‌ తొలి కార్యదర్శి అయిన పెటల్ గెహ్లాట్‌ శుక్రవారం మాట్లాడారు. పాకిస్థాన్‌కు ఘాటుగా సమాధానమిచ్చారు. భారత్‌కు వ్యతిరేకంగా నిరాధార, దురుద్దేశ ప్రచారం కోసం అంతర్జాతీయ వేదికలను పాకిస్థాన్‌ పదేపదే దుర్వినియోగం చేస్తున్నదని ఆమె ఆరోపించారు.కాగా, జమ్ముకశ్మీర్‌ తమ అంతర్భాగమని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది. తమ దేశ అంతర్గత ప్రాంతానికి సంబంధించిన అంశంపై మాట్లాడేందుకు పాకిస్థాన్‌కు ఎలాంటి అధికారం లేదని పేర్కొంది. దక్షిణాసియాలో శాంతి నెలకొనాలంటే పాకిస్థాన్ మూడు చర్యలు తీసుకోవాలని భారత్‌ సూచించింది. ‘మొదటిది సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టండి. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను వెంటనే మూసివేయండి. రెండవది చట్టవిరుద్ధమైన, బలవంతపు ఆక్రమణలో ఉన్న భారత భూభాగాల (పీవోకే)ను ఖాళీ చేయండి. మూడోది పాకిస్థాన్‌లోని మైనారిటీలపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను అరికట్టండి’ అని పెటల్ గెహ్లాట్‌ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.