జయలలిత ఒకరోజు ముందే చనిపోయారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి గురించి ఆర్ముగస్వామి కమిషన్  సంచలన విషయాలు వెల్లడించింది. జయ లలిత మృతి చెందారని.. ప్రకటన చేసిన సమయానికి ఒక రోజు ముందే ఆమె తుదిశ్వాస విడిచారని.. కమిషన్ పేర్కొంది. దీనిని తేలికగా తీసుకునేందుకు అవకాశం లేదని పేర్కొంది. జయ మృతిపై దర్యాప్తు జరిపించాలని నివేదికలో పేర్కొంది. జయ మృతిలో ఆమె నెచ్చెలి శశికళ పాత్రనూ ప్రస్తావించింది. ఆమెతో పాటు మాజీ మంత్రి మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆమె వ్యక్తిగత వైద్యుడిపై విచారణ జరపాలని సూచించింది.జయలలిత 2016లో అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె మరణంపై అనుమానం ఉందని మాజీ సీఎం పన్నీర్సెల్వం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విశ్రాంత న్యాయమూర్తి ఆర్ముగస్వామి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటుచేశారు.ఈ కమిషన్ జయలలిత మృతి విషయంలో పలువురిని విచారించింది. దానిలో భాగంగా పలు విషయాలను గుర్తించింది. వాటి ఆధారంగా శశికళ జయ వ్యక్తిగత వైద్యుడు శశికళ బంధువైన డాక్టర్ శివకుమార్పై దర్యాప్తు జరిపించాలని సూచించింది.అలాగే అప్పటి వైద్య శాఖ మాజీ కార్యదర్శి నేరపూరిత చర్యలకు పాల్పడ్డారని పేర్కొంది. ఆ శాఖ మాజీ మంత్రి సి. విజయ్భాస్కర్పై ఆ నివేదికలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇక ఆసుపత్రి వర్గాలు జయలలిత మరణించిన తేదీని 5.12.2016గా ప్రకటించాయి. కానీ ఆమె ముందురోజు అంటే డిసెంబరు 4వ తేదీ  మధ్యాహ్నం మూడు గంటల సమయంలోనే మృతి చెందినట్లు తాము విచారించిన సాక్షులను బట్టి తెలుస్తోందని నివేదిక వెల్లడించింది.జయలలిత మృతికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామంటూ 2021లో డీఎంకే ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసింది. ఈ క్రమంలోనే ఈ ఆగస్టులో ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇచ్చింది. దానిని స్టాలిన్ సర్కారు మంగళవారం అసెంబ్లీకి సమర్పించింది.

Leave A Reply

Your email address will not be published.