జుక్కల్ (బీ ఆర్ యస్) బరిలో సీతయ్య !

- రాష్ట్ర ఉత్తమ హెచ్ ఎం గా గుర్తింపు - బీ ఆర్ యస్ ముఖ్య నేతలతో చర్చలు - జుక్కల్ నియోజకవర్గం పై పూర్తి అవగాహన - ఆసక్తిగా మారుతున్న జుక్కల్ రాజకీయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలంలో గల మారుమూల ప్రాంతమైన బారంగేడ్గి గ్రామంలోని నిరుపేద కూలీ కుటుంబంలో జన్మించిన బోయి సీతయ్య నిజామాబాద్ జిల్లా పెర్కిట్ లో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెచ్ ఎం పనిచేస్తున్నారు. తన సొంత గ్రామం బరంగ్ ఏడ్గి అయినప్పటికీ తాను పుట్టి పెరిగింది మాత్రం అప్పటి మద్నూర్ మండలం (ప్రస్తుత డోంగ్లి మండలం) లోని హాసన్ టాక్లి గ్రామంలోనే. తన అయిదేండ్ల బాల్యం అక్కడే గడిపారు. అనంతరం ఐదవ తరగతి వరకు సొంత గ్రామంలో విద్యాబ్యాసం పూర్తి చేసి, తదనంతరం ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు వర్ని మండలం ఒడ్డెపల్లిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. తదనంతరం బోధన్ లోని మధుమలంచ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జి జి కాలేజ్ లో డిగ్రీ పట్టా పొందారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో బీ ఈడీ, చరిత్రలో ఎం ఏ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. మొట్టమొదటగా పిట్లం మండల కేంద్రంలో గల బాలికల ఉన్నత పాఠశాలలో బాగా రోజులు పని చేశారు. అనంతరం బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడలో గల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి, అక్కడి నుండి నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడి చేరారు. అక్కడి నుండి బదిలీ అయ్యి ప్రస్తుతం పెర్కిట్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తూనే నిజామాబాద్ జిల్లా డీసీఈబీ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. అయన బాన్సువాడ నియోజకవర్గం నకు చెందిన వారైనప్పటికీ ఆయనకు జుక్కల్ సెగ్మెంట్ అవినాభావ సంబంధాలు ఉన్నాయనే చెప్పాలి. ఆయనకు ఆ నియోజకవర్గంలోనే బంధుత్వం అధికంగా ఉండడంతో అధిక మొత్తంలో బంధువులు మద్దతుగా నిలుస్తున్నారు. అంతే కాకుండా ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నదనే చెప్పాలి.

గురువు కుమార్తెనే పెళ్లాడి…

తాను వర్ని మండల కేంద్రం లోని కోటయ్య క్యాంపులో అప్పుడున్న సాంఘిక సంక్షేమ హాస్టల్ లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకున్నారు. అప్పుడు వార్డెన్ గా పనిచేసిన జాదవ్ దశరథ్ కుమార్తె ను వివాహం చేసుకొని అందరి మన్ననలు పొందారు సీతయ్య. జాదవ్ దశరథ్ స్వగ్రామం జుక్కల్ మండల కేంద్రం కావడం విశేషం.

తాను సైతం దళితున్నే…..

జుక్కల్ నియోజకవర్గం లోని పిట్లం మండల కేంద్రంలో పని చేసినప్పుడు, అదేవిధంగా పాత బాన్సువాడ పాఠశాలల్లో పనిచేసే సమయంలో దళితులను దగ్గరకు తీసుకొని తాను కూడా దళితుడినేనని, ఏదైనా సమస్య ఉంటే తనవద్దకు రావాలని తన ఆత్మీయతను చాటుకోవడం అయన బ్లడ్ లోనే ఉన్నదని ఎంతో మంది దళితులు తెలియజేయడం గమనార్హం.

సేవాభావం అయన అభిమతం…

తల్లిదండ్రులు తనకు నేర్పిన గుణం ఇతరులకు సేవ చేయడం. అందుకే అయనకు సేవభవమే అభిమతం. దీనిలో భాగంగానే జుక్కల్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యమే తనకు ముఖ్యమని భావించిన ఆయన ఇటీవల బిచ్కుంద, పిట్లం మండల కేంద్రాలలో ఉచిత ఆరోగ్య శిభిరాలను నిర్వహించి నియోజకవర్గంలోని పేద వర్గాల ప్రజల మన్ననలను పొందారు. అదేవిధంగా తనకున్న పరిచయంతో ఒక వ్యాపారవేత్త సహకారంతో నియోజకవర్గంలో పాఠశాలలు, కళాశాలలకు సుమారుగా 15 లక్షల వ్యయంతో కూడిన క్రీడా సామాగ్రి అయిన క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లతో పాటు, డెస్క్ బెంచ్ లను అందజేశారు. దీంతో నియోజకవర్గంలోని విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, నాయకులు సైతం సీతయ్య రాకకై స్వాగతం పలుకుతున్నారు. ఈ సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో చర్చనీయంశంగా మారాయి.

బీ ఆర్ యస్ టికెట్ ఖాయం….

జుక్కల్ నియోజకవర్గంతో తనకున్న బంధుత్వం, సంబంధాల ఆధారంగా జుక్కల్ అసెంబ్లీ టికెట్ తనకే ఖాయమని సీతయ్య ధీమాగా ఉన్నారు. దానికి సంబందించిన క్షేత్రస్థాయి ప్రయత్నాలన్నీ పూర్తి అయ్యాయని, ఇక టికెట్ ప్రకటనే మిగిలిందని, రాజకీయంగా తనకు ఉన్న మద్దతును కూడ గట్టి, అదేవిధంగా జుక్కల్ సెగ్మెంట్ ఏర్పాటు అయిననుండి ఇప్పటి వరకు ఒక్క సారి మాత్రమే తెలుగుదేశం పార్టీ మాదిగ వర్గానికి చెందిన అరుణతారకు టికెట్ కేటాయించగా అయిదేండ్లు ఎమ్మెల్యేగా పని చేశారని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో పండరికి, హన్మంత్ షిండేలకు టికెట్ ఇవ్వగా వారు పలు మార్లు ఎమ్మెల్యేలుగా చలామణి అయ్యారని, తదనంతరం టీడీపీ నుండి తెరాస లోకి వచ్చిన హన్మంత్ షిండేకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి కెసిఆర్ టికెట్ ఇచ్చారని జుక్కల్ నియోజకవర్గంలోని మాదిగ సామజిక వర్గానికి చెందినవారు విమర్శలు చేయడంతో ఈ సారి మాదిగ సామజిక వర్గానికి చెందిన తనకు టికెట్ వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీతయ్య భరోసా వ్యక్తం చేస్తున్నారు.

జుక్కల్ లో మాదిగల మధ్యే త్రిముఖ పోటీ……

జుక్కల్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఈ నియోజకవర్గంలో ఓట్ల బాలబలాలు చుస్తే మాదిగ సామజిక వర్గానికి జరుగుతున్నది అన్యాయమే అని చెప్పాలి. జుక్కల్ అసెంబ్లీ ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు సుమారుగా 46 వేలు ఉంటే, మాల సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కేవలం 27 వేల ఓట్లు మాత్రమే. దీంతో ఈ సారి జుక్కల్ బరిలో తనంటే తాను అన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అధికారంలో ఉన్న బీ ఆర్ యస్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు టికెట్ రాదని, అయన దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడ్డారని ప్రచారం జరుగుతున్న తరుణంలో తెరపైకి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు బోయి సీతయ్య పేరు తెరపైకి రావడం గమనార్హం. అయన మాదిగ వర్గానికి చెందినవారు కావడం, అదేవిధంగా బీజేపీ పార్టీ అభ్యర్థినిగా దాదాపు ఖరారుగా ఉన్న అరుణతార సైతం మాదిగ వర్గానికి చెందినవారే. అంతేకాకుండా జుక్కల్ కాకా గా పేరుతెచ్చుకొన్న సౌదగర్ గంగారాం సైతం తనకే జుక్కల్ కాంగ్రెస్ టికెట్ అని చెప్పుకొంటున్నారు. ఈయన సైతం మాదిగ ఉపకులంలోని మోచి కులానికి చెందినవరనే చెప్పాలి. ఇకపోతే బీఎస్పీ అభ్యర్థిని కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికే వస్తుందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా రాజకీయ సమీకరణలు ఎవరెవరికి అనుకూలిస్తాయో వేచి చూడాల్సిందే మరి.

Leave A Reply

Your email address will not be published.