ప్రపంచరికార్డు సాధించేలా కంటి వెలుగు కార్యక్రమం

- సి.ఎస్ శాంతి కుమారి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నేటి నుండి దాదాపు వంద రోజుల పాటు కొనసాగే కంటి వెలుగు కార్యక్రమంలో ప్రపంచరికార్డు సాధించేలా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు.  హైదరాబాద్ లిబర్టీ ఏవీ కాలేజ్ లో కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణను సి.ఎస్ శాంతి కుమారి నేడు ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వి, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ , ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మొహంతి తదితర ఉన్నతాధికారులతో కలసి కంటి వెలుగు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ,  2018 లో నిర్వహించిన తొలివిడత కంటి వెలుగు కార్యక్రమంలో దాదాపు 1 .57 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 45 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసి ప్రపంచ రికార్డు సాధించడం జరిగిందని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న లాంఛనంగా ప్రారంభించిన ప్రస్తుత కంటి వెలుగు కార్యక్రమంలో తొలివిడత రికార్డుని అధిగమించి సరికొత్త రికార్డు సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత కంటి వెలుగును సమర్దవంతంగా నిర్వహించడానికి 15000 మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది తోకూడిన 1500 బృందాలు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 12,768 శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లో 3,788 శిబిరాలలో కంటి పరీక్షలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు.  ఈ శిబిరాల్లో ప్రత్యేక సాఫ్ట్ వర్ సహాయంతో నాణ్యమైన కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అవసరమైన వారికి అక్కడికక్కడే రీడింగ్ అద్దాలను అందచేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నిర్దారిత ప్రాంతాల్లో నేడు కంటి వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయని శాంతి కుమారి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.