లిక్కర్ స్కామ్‌లో ఛార్జిషీట్‌లో కవిత భర్త ఆర్ అనిల్ కుమార్ పేరు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సోమవారం (మే 1, 2023) కీలక పరిణామం చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరోసారి సంచలన అంశాలు వెలుగులోకొచ్చాయి. కుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారులకు సంబంధించి కీలక ఆధారాలున్నాయని మూడో ఛార్జిషీట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా ప్రస్తావించింది. మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, రాఘవపై ఈడీ సంచలన అభియోగాలు చేసింది. అంతేకాదు, ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణను ఎదుర్కొన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఛార్జిషీట్‌లో ఈడీ పలుమార్లు ప్రస్తావించింది. నిందితుల లావాదేవీలకు సంబంధించిన వాట్సాప్ చాట్స్‌, ఈ-మెయిల్స్‌ను ఛార్జిషీట్‌లో ఈడీ జత చేసింది.మద్యం వ్యాపారంతో పాటు ఆర్థిక లావాదేవీలపై ఈడీ అభియోగాలు చేయడం గమనార్హం. లిక్కర్ స్కాంలో ముడుపులను కవితే ఇచ్చారని ఈడీ పేర్కొనడం సంచలనంగా మారింది. ట్విస్ట్ ఏంటంటే ఛార్జిషీట్‌లో కవిత భర్త ఆర్ అనిల్ కుమార్ పేరు కూడా ఉంది. తొలిసారిగా కవిత భర్త పేరు ప్రస్తావనకు రావడం కొసమెరుపు. ఈడీ ఛార్జీషీటులో మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ, కవిత, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్ పల్లితో పాటు పలువురు ఇతర తెలుగు వ్యక్తులు, సంస్థల ప్రస్తావన ఉండటం గమనార్హం. అంతేకాదు.. కవిత సన్నిహితుడు శ్రుజన్ రెడ్డి, కవిత సన్నిహితుడు వి శ్రీనివాసరావు,ముత్తా గౌతమ్, ఫీనిక్స్ శ్రీహరి, తక్కళ్ళపల్లి లుపిన్, బి వి నాగేశ్వర్ రావు, రవిశంకర్ చిట్టి, దండు రాజేష్, రవివర్మ రాజు, కెవిఎస్ పి రాజు, అనిల్ రాజు, సంస్థలు ఫీనిక్స్ గ్రూపు, ఎన్ గ్రోత్ క్యాపిటల్, క్రియేటివ్ డెవలపర్స్, ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా హెడ్ పేర్లను ఈడీ మూడో ఛార్జిషీట్‌లో చేర్చింది.మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, రాఘవ, కవిత, శరత్‌చంద్రారెడ్డితో కూడిన సౌత్‌గ్రూప్‌ రూ.100 కోట్లను హవాలా రూపంలోనే ఇచ్చారని ఈడీ ఆరోపించింది. లిక్కర్‌ పాలసీ తమకు అనుకూలంగా ఉండేలా ముడుపుల ద్వారా సౌత్‌గ్రూప్ భారీగా లబ్ధి పొందిందని, హవాలా, ముడుపులు, భూముల కొనుగోళ్లను మూడో ఛార్జిషీట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా ప్రస్తావించింది. బినామీలతో మాగుంట, కవిత వ్యాపారం చేశారని ఈడీ ఆరోపించింది. ప్రేమ్‌రాహుల్ మాగుంట బినామీ అని, పిళ్లై కవిత బినామీ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్‌లో తెలిపింది. ఇండోస్పిరిట్‌లో మాగుంట, కవిత ప్రతినిధులుగా ప్రేమ్‌రాహుల్, పిళ్లై ఉన్నారని, ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఇండోస్పిరిట్‌ రూ.192 కోట్ల లాభాలు ఆర్జించిందని ఈడీ పేర్కొంది.తాజాగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మూడో ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. వైసీపీ ఎంపీ మాగుంట, ఆయన కుమారుడు రాఘవరెడ్డితో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా మరిన్ని చిక్కుల్లో పడినట్లు స్పష్టమవుతోంది. సౌత్‌ గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా ప్రమోటర్‌ శరత్‌రెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవతోపాటు గ్రూప్‌ ప్రతినిధులుగా అరుణ్‌ రామచంద్ర పిళ్లై, అభిషేక్‌, బుచ్చిబాబు ఉన్నారు. కవితకు లబ్ధి చేకూర్చడానికి అరుణ్‌ పిళ్లై అన్నీ తానై వ్యవహరించాడని ఈడీ తన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌’లోని క్రిమినల్‌ సెక్షన్ల కింద అరుణ్‌ పిళ్లైను అరెస్టు చేసింది. హైదరాబాద్ నగర శివార్లలోని వట్టినాగులపల్లిలో రూ.2.2 కోట్ల విలువ చేసే భూమిని జప్తు చేసిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరు కావాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు త్వరలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే ఈడీ కవితను పలుమార్లు విచారణకు పిలిచి గంటల తరబడి విచారించిన విషయం విదితమే. ‘‘ఢిల్లీ మద్యం వ్యాపారంతో మీకు సంబంధమేంటి? మద్యం కుంభకోణంలో మీ పాత్ర ఏమిటి? మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై మీ బినామీయా? కాదా? ఈ వ్యాపారంలో మీరు ఎంత మేరకు పెట్టుబడులు పెట్టారు? ఇండో స్పిరిట్‌లో 32.5 శాతం వాటాతోపాటు పెర్నాడ్‌ రికార్డ్‌ పంపిణీదారుగా కూడా మీకు భాగస్వామ్యం ఉందా? సౌత్‌ గ్రూప్‌లో మీ వాటా ఎంత? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? హవాలా ద్వారా ఢిల్లీకి పంపిన డబ్బులు ఎవరివి? ఢిల్లీ ఒబెరాయ్‌ హోటల్‌లో మద్యం వ్యాపారులు, ఆప్‌ నేతలతో మీరు సమావేశమయ్యారా? అక్కడ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జి విజయ్‌ నాయర్‌లను కలుసుకున్నారా? ఆప్‌తో మీకు ఉన్న రాజకీయ సంబంధాలేమిటి? పంజాబ్‌, గోవా ఎన్నికల్లో ఆప్‌కు నిధుల సహాయం చేశారా? హైదరాబాద్‌లో కూడా మీ నివాసంలో ఇండో స్పిరిట్‌ యజమాని సమీర్‌ మహేంద్రును కలుసుకున్నారా? లేదా? దాదాపు పది ఫోన్లను ఎందుకు మార్చాల్సి వచ్చింది? లేదా ధ్వంసం చేయాల్సి వచ్చింది? హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌లో అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబు తదితరులు విజయ్‌ నాయర్‌తో మీ ప్రేరణతోనే చర్చలు జరిపారా?’ వంటి ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించినట్లు సమాచారం. తాజాగా.. మూడో ఛార్జిషీట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొన్న అంశాలను గమనిస్తే మరోమారు ఈడీ విచారణను కవిత ఎదుర్కొనక తప్పేలా లేదు.

Leave A Reply

Your email address will not be published.