పేదల సొంతింటి కల నిజం చేయడమే కేసిఆర్ ప్రభుత్వ ధ్యేయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ.. పేదల సొంతింటి కలను నెరవేర్చే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ ప్రగతి మరియు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ వివరాలపై బుధవారం నాడు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మంత్రుల నివాస సముదాయంలోని మంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ,ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

రెండు పడకల గృహ నిర్మాణ పథకంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,91,057 ఇండ్లు రూ.19,328.32 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో మంజూరీ చేయగా.. 2,28,529 గృహాలకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు.

నిర్మాణం ప్రారంభించిన 2,28,529 డబుల్ బెడ్రూం ఇండ్లకు గాను 1,29,528 గృహాలు ఇప్పటికే పూర్తి అయ్యాయన్నారు. మిగతా 58,350 గృహాల నిర్మాణం తుది దశలో ఉన్నదని తెలిపారు. మిగతా 40,651 డబుల్ బెడ్రూం ఇండ్లు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయన్నారు.

నిర్మాణం పూర్తి అయినా మరియు నిర్మాణము తుది దశలో ఇండ్లకు మౌలిక సదుపాయాలు పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని మంత్రి వేముల అధికారులను ఆదేశించారు. అదే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల ప్రకారం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా త్వరగా పూర్తి చేసి అర్హులైన లబ్దిదారులకు ఇండ్లు అందజేసెందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

పేదల సొంతింటి కల నిజం చేయడమే కేసిఆర్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ.11,614.95 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.