కెసిఆర్ పాలన నిజాం పరిపాలనను తలపిస్తుంది

.. పోలీసుల కనుసనల్లోనే ఈ దాడి జరిగింది .. కెసిఆర్ కు సర్వేల భయం పట్టుకుంది. .. పిచ్చుకపై తాము బ్రహ్మాస్త్రం ప్రయోగించం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నిజాం పరిపాలనను తలపిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గృహంపై టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడడంతో అరవింద్ గృహాన్ని సాయంత్రం కిషన్ రెడ్డి సందర్శించారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడిని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషీ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసానికి వెళ్లిన మంత్రి కిషన్ రెడ్డి దాడి జరిగిన తీరును పరిశీలించారు. అరవింద్ తల్లి విజయలక్ష్మిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పార్టీ గూండాయిజం అంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అరవింద్ నివాసంపై అధికార పార్టీ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని కిషన్ రెడ్డి అన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమీపంలో ఉన్న అరవింద్ ఇంటిపై జరిగిన ఈ దాడి పోలీసులకు తెలియనిదా? అంటూ ప్రశ్నించడమే కాకుండా ఇదంతా పోలీసుల కనుసన్నల్లోనే జరిగిందంటూ ఆరోపించారు. దాడి జరుగుతుంటే అక్కడేవున్న పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. రాజధాని నడిబొడ్డున ప్రముఖులు, రాజకీయ నాయకులు నివసించే ఎమ్మెల్యే కాలనీలోనే ఇలాంటి ఘటన జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్రం ఎటుపోతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. అధికార పార్టీ గూండాయిజానికి, రౌడీయిజానికి, అహంకారపూరితమైన పరిపాలనకు ఇదే నిదర్శనమన్నారు. సర్వేలు ఆపాలంటూ కేసీఆర్‌కు కిషన్ రెడ్డి హితవు పలకడమే కాకుండా నిరాశ, నిస్పృహలో, అభద్రతా భావంలో టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది అక్టోబర్ వరకు సర్వేలు ఆపాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నానని అన్నారు. సర్వేలు చేసి అభద్రతా భావంతో, ఓడిపోతామనే భయంతో కేసీఆర్  దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు, మజ్లిస్‌ను అడ్డుపెట్టుకుని దాడులు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ దాడులకు తెలంగాణ ప్రజలు సమాధానమిస్తారన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఘనక కేసు పెట్టాల్సి వస్తే మొట్టమొదటి కేసు ముఖ్యమంత్రి కేసీఆర్ పై పెట్టాలని  కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకోవాలని కోరిక తమకు లేదని, భయపెట్టి, బతిమిలాడి పార్టీలో చేర్చుకునే అవసరం తమకు లేదన్నారు కిషన్ రెడ్డి. ఊరికొక ఎమ్మెల్యే, మంత్రి కూర్చుంటేనే మునుగోడులో గెలిచారని ఎద్దేవా చేశారు.  ఆయన ఇప్పటికే ఎన్ని పార్టీల గొంతు నొక్కారో అందరికీ తెలుసన్నారు. దేశంలో ఇతర పార్టీల మెప్పు కోసమే  కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని, మోడీని ఢీకొంటున్నట్లు ఇతరులు అనుకోవాలని ఈ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలనకు పాతరేసే రోజులొచ్చాయని కిషన్ రెడ్డి అన్నారు. అధికారం ప్రజలిస్తారు. ఇతర పార్టీల వారు కాదని వ్యాఖ్యానించారు కిషన్ రెడ్డి. ప్రచార ఆర్భాటం కోసమే సిట్ అంటూ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ ను కూల్చే ఆలోచన తమకు లేదని, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించలేమని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని నిజాం రాజ్యంగా మార్చారని కిషన్ రెడ్డి విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.