బీఆర్ఎస్‌లో చేరనున్న ఏపీ కీలక నేతలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఏపీలో బీఆర్ఎస్ పాత్రపై రకరకాల ఉహాగానాలు వినిపిస్తోన్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నేతలు.. బీఆర్ఎస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏపీలోని ముగ్గురు కీలక నేతలు సోమవారం బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. జనసేన నేత తోట చంద్రశేఖర్ సోమవారం మధ్యాహ్నం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. అలాగే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్థసారథి బీఆర్‌ఎస్‌‌లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.బీఆర్ఎస్‌ ఏపీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ పరిశీలనలో ఉన్నారు. తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా- ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును ఎఫెక్ట్ చేసేలా కేసీఆర్ వ్యూహం రచించారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అయిన చంద్రశేఖర్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడ్ని చేస్తే కాపుల్లో కొందరు బీఆర్ఎస్ వైపునకు ఆకర్షితులవుతారని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తోట చంద్రశేఖర్ గతంలో వైసీపీలో పని చేశారు. 2014లో ఏలూరు లోక్ సభ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థి మాగంటి బాబు చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసినా.. ఫలితం దక్కలేదు.

Leave A Reply

Your email address will not be published.