తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ?

-    ఎంపీ బండి సంజయ్‌కి  కేంద్ర  మంత్రి పదవి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్; తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తూ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కేంద్రం ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. అయితే ఈయనకు ఇప్పుడున్న కేంద్ర మంత్రి పదవి కూడా కొనసాగింపు ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పదవి స్వీకరించడానికి కిషన్ రెడ్డి.. విముఖత చూపినప్పటకీ ప్రధాని నరేంద్ర మోదీకేంద్ర హోం మంత్రి అమిత్ షాజాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాఅగ్రనేత బీఎల్ సంతోష్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యి ఒప్పించినట్లుగా తెలుస్తోంది.

కాగా.. ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంది అధిష్టానం. బండికి కేంద్ర మంత్రిగా అగ్రనేతలు ప్రమోషన్ ఇచ్చారు. కేంద్ర సహాయక మంత్రిగా నియమించినట్లు ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది కానీ.. ఏ శాఖ కేటాయించారన్న విషయం మాత్రం తెలియరాలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కాసేపట్లో అధ్యక్ష పదవి, కేంద్ర మంత్రిపదవికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే.. ఉంటే అధ్యక్షుడిగా లేకుంటే ఏ పదవీ తనకొద్దనీ సామాన్య కార్యకర్తగానే పార్టీ కోసం పనిచేస్తానని తన అత్యంత సన్నిహితుల వద్ద బండి తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన వచ్చాక బండి ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై అభిమానులు, తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. మొదట్నుంచీ అనుకుంటున్నట్లుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా అగ్రనాయకత్వం ప్రకటించబోతోంది. రెండు మూడ్రోజులుగా ఈటల యమా యాక్టివ్‌గా ట్వీట్లు చేయడం, బీజేపీ నేతలతో వరుసగా భేటీలు కావడం.. అది కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని సైతం స్వయంగా ఇంటికెళ్లి మరీ రాజేందర్ కలుస్తున్నారు. అయితే కిషన్ రెడ్డి పదవి స్వీకరించడానికి సానుకూలంగా లేకపోతే తర్వాతి ఆప్షన్‌గా ఈటల రాజేందర్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.