ప్రజలను స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వండి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:  దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న డిమాండ్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఈ సమయంలో ప్రజలను స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వండి. వారి డబ్బును స్వీట్ల కోసం ఖర్చు పెట్టనివ్వండి’ అని వ్యాఖ్యానించింది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు ఢిల్లీలో పటాకుల వినియోగం, విక్రయాలపై కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) నిషేధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వ్యాపారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.కేసు ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉందంటూ విచారణ జరిపేందుకు నిరాకరించింది. దీంతో బాణాసంచా విక్రేతలు అత్యవసరంగా విచారణ జరుపాలని కోరారు. కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. పటాకులు విక్రయాలు చేపడితే రూ.5వేల జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించారు. అలాగే పటాకులు కొనుగోలు చేస్తే రూ.200 జరిమానాతో పాటు ఆరునెలల వరకు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో చలితీవ్రత పెరుగుతుండడంతో ప్రభుత్వం పటాకులపై బ్యాన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకున్నది.

Leave A Reply

Your email address will not be published.