మార్చ్ 31 లోగా ఆధార్‌ కార్డుతో మీ పాన్‌ కార్డును అనుసంధానం తప్పనిసరి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెలాఖరులోగా ఆధార్‌ కార్డుతో మీ పాన్‌ కార్డును అనుసంధానించుకోవడం తప్పనిసరి. ఇప్పుడైతే రూ.1000 ఫైన్‌తో సరిపెట్టుకోవచ్చు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రూ.10 వేలు ఫైన్‌ పే చేయాలి. ఆర్థిక లావాదేవీలు జరుపడానికి ఇబ్బందులు తలెత్తుతాయి.ఇప్పుడు వేతన జీవులు ప్రతి ఏటా ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయాలన్నా, ఇల్లు-బిజినెస్‌-పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలనుకున్నా, బీటెక్‌ లేదా ఎంబీబీఎస్‌ లేదా ఎంబీఏ/ఎంసీఏ వంటి కోర్సులు అభ్యసించే విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేయాలన్నా, బ్యాంకుల్లో సేవింగ్స్‌ ఖాతా లేదా డీమ్యాట్‌ ఖాతా ఓపెన్‌ చేయాలన్నా ఆదాయం పన్ను చట్టం-1961 ప్రకారం పాన్‌ కార్డు తప్పనిసరి. 2010లో ఆధార్‌ అమల్లోకి రావడంతో ప్రతి పాన్‌ కార్డు హోల్డర్‌, తన ఆర్థిక లావాదేవీల కోసం తప్పనిసరిగా ఆధార్‌ కార్డుతో అనుసంధానించాల్సిందే. ఇప్పటికే గడువు ముగిసినా, రూ.1000 ఫైన్‌తో ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ).

నెలాఖరులోగా లింక్‌ చేయకుంటే ఇదీ పరిస్థితి

ఈ నెలాఖరులోపు అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయకుంటే ఆదాయం పన్ను చట్టంలోని 272బీ సెక్షన్‌ కింద రూ.10వేల వరకు ఫైన్‌ విధించే అవకాశం ఉంది.దీనికి తోడు ఆధార్‌ కార్డుతో లింక్‌ చేయకుంటే వచ్చేనెల ఒకటో తేదీ నుంచి పాన్‌ కార్డు నిరుపయోగంగా మారుతుంది.అలా పనికిరాని పాన్‌ కార్డుతో ఆర్థిక లావాదేవీలు జరుపడం సాధ్యం కాదు.ఇప్పటికీ మీరు మీ పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానించారా.. లేదా.. ఒకసారి చెక్‌ చేసుకోండి. ఒకవేళ లింక్‌ చేయకుంటే ఎలా పూర్తి చేయాలో తెలుసుకోండిలా..

రూ.1000 ఫైన్‌ చెల్లించి ఇలా ఆధార్‌తో పాన్‌ లింక్‌ చేయాలి

ఎంతోకాలంగా ప్రతి పాన్‌కార్డు హోల్డర్‌ తన ఆధార్‌ కార్డుతో అనుసంధానించాలని ఎంతోకాలంగా సీబీడీటీ చెబుతున్నది.ఇప్పటికే చాలా మంది ఆ ప్రక్రియ పూర్తి చేశారు. కొందరికైతే తాము పాన్‌-ఆధార్‌ అనుసంధానించామా.. లేదా అన్నది తెలియదు.అటువంటి డౌట్లు ఉన్నవారు ఒకసారి ఆదాయం పన్నుశాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్‌ చేసుకుంటే సరి.పాన్‌-ఆధార్‌ అనుసంధానం అయ్యాయా.. లేదా.. అనే సంగతి తెలిసిపోతుంది.అనుసంధానమైతే అప్పటికే లింక్‌ చేసినట్లు మెసేజ్‌ వస్తుంది.లేకపోతే రూ. 1000 చెల్లించి అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆదాయం పన్నుశాఖ వెబ్‌సైట్‌, ఎన్‌ఎస్‌డీఎల్‌ వెబ్‌సైట్‌ల్లో ఏదో ఒకదాని నుంచి పాన్‌-ఆధార్‌ అనుసంధానానికి ఫైన్‌ చెల్లించొచ్చు.

ఆదాయంపన్నుశాఖ వెబ్‌సైట్‌ నుంచి ఇలా

తొలుత ఆదాయం పన్నువిభాగం వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో ‘E-Pay Tax`పై క్లిక్‌ చేయాలి.అటుపై మీరు మీ పాన్‌ నంబర్‌ రెండుసార్లు వెరిఫై చేసుకోవాలి.కింద ఆధార్‌తో మీరు లింక్‌ చేసిన మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ నమోదు చేయాలి.ఆ తర్వాత పేజీలో మీ ఫోన్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీ నంబర్ ఎంటర్‌ చేస్తే వెరిఫికేషన్‌ పూర్తవుతుంది.వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత మీకు కనిపించే వేర్వేరు పేమెంట్‌ ఆప్షన్లలో ఒక దానిని మీరు ఆప్ట్‌ చేసుకోవాలి.ఒకవేళ, మీ వద్ద బ్యాంకింగ్‌ ఆప్షన్లు లేకపోతే రెండో పద్దతి అనుసరించాలి.అటుపై ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసే అంచనా సంవత్సరం (2023-24) ఆప్షన్‌ ఎంచుకోవాలి.తదుపరి (500) అదర్‌ రిసిప్ట్స్‌ ఎంచుకున్నా.. పేమెంట్‌ గేట్‌వేకు వెళ్లి, ఫైన్‌ చెల్లింపు పూర్తి చేయాలి.ఫైన్ చెల్లింపు పూర్తయిన తర్వాత ఆ వివరాలన్నీ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ప్రక్రియ పూర్తి చేసిన నాలుగైదు రోజులకు ఆదాయం పన్ను శాఖ ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో లింక్‌ ఆధార్‌ క్లిక్‌ చేసి పాన్‌ కార్డు అనుసంధానించుకోవచ్చు.

ఎన్‌ఎస్‌డీఎల్‌ వెబ్‌సైట్‌లో ఇలా అనుసంధానం

ఎన్‌ఎస్‌డీఎల్‌ వెబ్‌సైట్‌ (egov-nsdl.com) వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. నాన్‌-టీడీఎస్‌/ టీసీఎస్‌ పేమెంట్స్‌ విభాగంలోకి వెళ్లాలి.అక్కడ టాక్స్‌ అప్లికబుల్‌ (Tax Applicable) – (0021) ఆప్షన్‌ ఎంచుకోవాలి.అటుపై (500) Other receipts ఆప్షన్‌లోకి వెళ్లాలి.తదుపరి పాన్‌, ఐటీ అంచనా సంవత్సరం (2023-24), చెల్లింపు విధానం, అడ్రస్‌, ఈ-మెయిల్‌, మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ తదితర డిటైల్స్‌ నమోదు చేయాలి.క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి, చెల్లింపులు పూర్తి చేసేయాలి.ఈ ప్రక్రియ పూర్తి చేసిన నాలుగైదు రోజుల తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో పాన్‌-ఆధార్‌ కార్డు అనుసంధానించాలి.

ఎస్సెమ్మెస్‌ ద్వారా ఆధార్‌తో పాన్‌ అనుసంధానం

ఆధార్‌ నంబర్‌తో అనుసంధానమైన మీ ఫోన్‌ నంబర్‌ నుంచి ఎస్సెమ్మెస్‌ పంపడం ద్వారా పాన్‌-ఆధార్‌ లింక్‌ పూర్తిచేయొచ్చు. అందుకోసం..స్టెప్‌ 1: యూఐడీపీఏఎన్‌ (UIDPAN) అని టైప్‌ చేసి స్పేస్‌ ఇవ్వాలి.స్టెప్‌ 2: 12-అంకెల ఆధార్‌ నంబర్‌ నమోదు చేసి స్పేస్‌ ఇవ్వాలి.
స్టెప్‌ 3: 10-అంకెల పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌ (పాన్‌-PAN) ఎంటర్‌ చేసి స్పేస్‌ ఇవ్వాలి

ఎస్సెమ్మెస్‌ ఇలా ఉండాలి..

యూఐడీపీఏఎన్‌ (UIDPAN) < 12 అంకెల ఆధార్‌ నంబర్‌ > < 10 అంకెల పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌>స్టెప్‌ 4: మెసేజ్‌ని 567678 లేదా 56161 అనే నంబర్‌కు పంపాలి.
స్టెప్‌ 5: ప్రతిస్పందన కోసం వెయిట్‌ చేయాలి.ఆధార్‌తో పాన్‌ అనుసంధానం పూర్తయితే.. ‘ఐటీడీ డేటా బేస్‌లో ఆధార్‌ ఇప్పటికే పాన్‌ కార్డు నంబర్‌తో అనుసంధానమైంది. మా సేవలు ఉపయోగించుకున్నందుకు ధన్యవాదాలు’ అనే మెసేజ్‌ వస్తుంది.

లింక్‌ చేయకుంటే ఇబ్బందులు ఇలా

ఈ నెలాఖరులోగా ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానించకుంటే, వచ్చేనెల ఒకటో తేదీ నుంచి సదరు పాన్‌ కార్డు నిరుపయోగం అవుతుంది.

అలా నిరుపయోగమైన పాన్ కార్డుతో బ్యాంకులో సేవింగ్స్‌ ఖాతా గానీ, స్టాక్స్‌ ట్రేడింగ్‌ చేసే డీమ్యాట్‌ ఖాతా గానీ ఓపెన్‌ చేయలేరు.మ్యూచువల్‌ ఫండ్స్‌లో నిధుల మదుపునకు నిబంధనలు అడ్డొస్తాయి.అంతేకాదు.. ఆదాయం పన్నుచట్టం-1961లోని నిబంధనల ప్రకారం ఐటీ అధికారులు చర్యలు తీసుకుంటారు.ఒకవేళ డీమ్యాట్‌ ఖాతా ఉన్నా, షేర్లలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడానికి కుదరదు.బేసిక్‌ ఆదాయంపై టీడీఎస్‌ విధించే చోట ఎక్కువ మొత్తంలో పన్ను పే చేయాలి.

సెక్యూరిటీస్‌ మార్కెట్‌లో అన్నిరకాల లావాదేవీలకు పాన్‌ కార్డు కీలకం. కనుక అది తప్పనిసరిగా చెల్లుబాటులో ఉండేలా చూసుకోవాలి.పాన్‌-ఆధార్‌ అనుసంధానించకపోతే కేవైసీ నిబంధనలు పాటించలేదని భావించి పెట్టుబడుల లావాదేవీలపై పరిమితులు విధించొచ్చునని ఇప్పటికే స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ నెల తొమ్మిదో తేదీన తేల్చిచెప్పింది. పాన్‌-ఆధార్‌ అనుసంధానంతోనే హాయిగా ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్లు జరుగుతాయని స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.