ప్రభుత్వ హాస్టల్ లో లిక్కర్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లో మద్యం రాజ్య మేలుతుంది. నిన్న సూర్యాపేట జిల్లాలో ప్రిన్సిపాల్ రూంలో బీర్ బాటిళ్లు దొరికాయి. ఈ ఘటన మరువకముందే కొద్ది గంటల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూర్ బీసీ హాస్టల్ లో మద్యం బాటిళ్లు కనిపించాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలోని బీసీ హాస్టల్ లో అర్ధరాత్రి బీర్ బాటిళ్లు దర్శనమిచ్చాయి. బీసీ హాస్టల్ పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పుట్టిన రోజు. దీంతో హాస్టల్ వార్డెన్ లేని సమయంలో తోటి విద్యార్థులు కేక్ కట్ చేసిన అనంతరం హాస్టల్ లోనే పార్టీ చేసుకున్నారు. అయితే కేక్ పార్టీ కాదు. మద్యం పార్టీ చేసుకున్నారు విద్యార్థులు. బీరు బాటిళ్లు హాస్టల్ కు తెచ్చుకొని తాగుదామనే టైంలో హాస్టల్ పక్కన నివాసం ఉంటున్న స్థానికులు చూసి విద్యార్థులను మందలించారు. దీంతో  విద్యార్థులు అక్కడి నుంచి పరారైపోయారు. దీంతో బీర్ బాటిళ్లు, కూల్ డ్రింక్స్ ఎక్కడివడే ఉన్నాయి. ఈ ఘటన అర్థరాత్రి 11 గంటల తరువాత జరిగినట్లుగా స్థానికులు తెలిపారు. అయితే పాలకుర్తి ఎమ్మెల్యే సొంత గ్రామం చర్లపాలెం కావడం గమనార్హం
ప్రిన్సిపల్ గదిలో బీర్లు కొద్ది గంటల ముందే సూర్యాపేటలోనూ ఇలాంటి ఘటన వెలుగు చూసింది. సూర్యాపేటలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్  గదిలో లిక్కర్ బాటిళ్లు కనిపించాయి. బాలికల నిరసనతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్ తరచూ తమను వేధిస్తున్నారని రెండ్రోజుల నుంచి ఆ కాలేజీ బాలికలు ఆందోళన చేపట్టారు. గత శనివారం మహిళా ప్రిన్సిపాల్ గదిలో నాలుగు బీరు బాటిళ్లు కనిపించడంతో ఆ రూమ్ కు తాళం వేసి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్  శైలజ తమతో బాగా కఠినంగా ఉంటున్నారని.. ఆఖరికి తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదని బాలికలు వాపోయారు. ప్రశ్నిస్తే తమపై చేయి చేసుకుంటున్నట్లు ఆవేదన చెందారు. ప్రిన్సిపల్ శైలజ తన గదిలోనే సౌమిత్రితో కలిసి మందు తాగుతారని బాలికలు ఆరోపించారు. తమ సమస్యలపై ప్రశ్నిస్తే మాత్రం పట్టించుకోరని అన్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. ఆర్డీవో వేణుమాధవరావు సహా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి, డీఎస్పీ రవికుమార్ సీఐ రాజశేఖర్ రూరల్ ఎస్సై బాలునాయక్ తదితరులు కాలేజీకి చేరుకుని బాలికలతో మాట్లాడారు. అనంతరం ప్రిన్సిపల్ శైలజను సస్పెండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.