36 ఏళ్లుగా కవల సోదరుడి పిండాన్ని మోసిన వ్యక్తి..

- వైద్య శాస్త్రంలోనే అరుదైన ఘటన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహారాష్ట్ర నాగ్‌పూర్‌ లో వైద్య శాస్త్రంలోనే అరుదైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తనకు తెలియకుండానే తన కవల సోదరుడి పిండాన్ని 36 సంవత్సరాలపాటు కడుపులో మోశాడో వ్యక్తి. 1999లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ‘ది డైలీ స్టార్’ పత్రిక తాజాగా తన కథనం ద్వారా వెల్లడించింది.నాగ్‌పూర్‌కు చెందిన సంజూ భగత్ 1963లో జన్మించారు. ఆయనకు 20 ఏళ్ల వయసు వచ్చేసరికి పొట్ట అసాధారణంగా పెరగడం ప్రారంభమైంది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సంజూ పొట్ట ఇలాగే ఉండటంతో.. అతన్ని ప్రెగ్నెంట్ మ్యాన్ (అంటూ స్థానికులు హేళన చేసేవాళ్లు. అయితే అవేవీ పట్టించుకోలేదు సంజూ. రాను రాను పొట్ట మరింత ఉబ్బెత్తుగా మారి, శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో 1999లో ముంబైలోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు.అక్కడ సంజూను పరిశీలించిన వైద్యులు అతని కడుపులో కణతి ఉందని, శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. ఈ క్రమంలో ఆపరేషన్ సమయంలో పొట్టలో ఉన్నది చూశాకా వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సంజూ కడుపులోంచి మనిషి అవయవాలు ఒకటొకటిగా బయటకు రావడం మొదలు పెట్టాయి. 36 ఏళ్లుగా తన కవల సోదరుడి పిండం సంజూ భగత్ లో ఉన్నట్లు డాక్టర్ అజయ్ మెహతా తెలిపారు. దీన్ని వైద్య పరిభాషలో ‘ఫీటస్ ఇన్ ఫీటు’ (పిండంలో పిండం) అంటారని చెప్పారు. ఐదు లక్షల మందిలో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉందని డాక్టర్ మెహతా వివరించారు. కాగా, ప్రస్తుతం సంజూ భగత్ వయసు 60 ఏళ్లు.

Leave A Reply

Your email address will not be published.