బిజెపి కొత్త అధ్యక్షులుగా మనోహర్ లాల్ ఖట్టర్?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు స్థానంలో కొత్త అధ్యక్షుడు రానున్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా హిమాచల్ ప్రదేశ్ కు చెందిన జగత్ ప్రకాష్ నడ్డా (జేపీ నడ్డా) ఉన్నారు. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలు కావడం జేపీ నడ్డా మెడకు చుట్టుకుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి.జేపీ నడ్డా సొంత పార్టీలోని ప్రత్యర్థులను అణచివేయడానికి చేపట్టిన చర్యలతోనే బీజేపీ ఓడిపోయిందని టాక్ నడుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 స్థానాలకు గానూ బీజేపీ కేవలం 25 సీట్లకే పరిమితమైంది. దీంతో జేపీ నడ్డాపై ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగ్రహంగా ఉన్నారని.. నడ్డాను మార్చాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.జేపీ నడ్డా స్థానంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తారని టాక్ నడుస్తోంది. ఖట్టర్ ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు కావడం కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. కాగా మనోహర్ లాల్ ఖట్టర్ గత ఎనిమిదేళ్లుగా హరియాణా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన వ్యవహార శైలిపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని అంటున్నారు.
హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ఉత్తరాఖండ్ ల్లో మార్చినట్టు ముఖ్యమంత్రిని మార్చేస్తే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించవచ్చని బీజేపీ అధిష్టానం ఆలోచనగా ఉందని అంటున్నారు. లేకుంటే హిమాచల్ ప్రదేశ్ మాదిరిగా హరియాణాలోనూ తమకు శృంగభంగం కాక తప్పదని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి సన్నిహితుడైన మనోహర్ లాల్ ఖట్టర్ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తారని అంటున్నారు. ఖట్టర్ మోదీ ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ లుగా ఉన్నారు. 1996లో మోదీ హరియాణా బీజేపీ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరించారు.అదేవిధంగా 2001లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాగానే భూకంపానికి గురైన కచ్ ప్రాంతంలో పార్టీని గెలిపించే బాధ్యతను ఖట్టర్కు అప్పగించారు. ఇక 2014లో మోదీ ప్రధాని అయ్యాక.. హరియాణా ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఖట్టర్ నే ముఖ్యమంత్రిగా నియమించడం గమనార్హం.నిజానికి 2019 అక్టోబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలకు గాను బీజేపీ 41 స్థానాలు మాత్రమే గెలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీకి స్థానాల దూరంలో నిలిచిపోయింది. దీంతో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీతో కలిసి ఖట్టర్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రధానికి అత్యంత సన్నిహితుడైనందునే ఆయనకు రెండోసారి సీఎం పదవి దక్కిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. లేదంటే వేరే వారికి సీఎం పగ్గాలు దక్కేవని చెప్పుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.