భార‌త్‌కు చెందిన‌ అమెరికా గ‌ణిత శాస్త్ర‌వేత్త సి.ఆర్. రావు క‌న్నుమూత

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భార‌త్‌కు చెందిన‌ అమెరికా గ‌ణిత శాస్త్ర‌వేత్త క‌ల్యంపుడి రాధాకృష్ణ రావు క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు102 ఏళ్లు. ప్ర‌పంచంలోనే ప్ర‌ఖ్యాత సంఖ్యాశాస్త్ర‌వేత్త‌గా ఆయ‌నకు గుర్తింపు ఉన్న‌ది. స్టాటిస్‌టిక్స్ రంగంలో నోబెల్ బ‌హుమ‌తిగా కీర్తించ‌బ‌డే ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్‌టిక్స్‌ను ఆయ‌న గెలుచుకున్నారు. ఈ ఏడాదే ఆయ‌న‌కు ఆ అవార్డును ప్ర‌దానం చేశారు. ఆధునిక గ‌ణిత శాస్త్రంలో సీఆర్ రావును ప్రావీణ్యుడిగా గుర్తిస్తారు. మ‌ల్టీవేరియేట్ విశ్లేష‌ణ‌, శాంపిల్ స‌ర్వే థియరీ, బ‌యోమెట్రి లాంటి అంశాల్లో ఆయ‌న ప‌నిచేశారు.క‌ర్నాట‌క‌లోని హ‌డ‌గలిలో ఓ తెలుగు కుటుంబంలో ఆయ‌న జ‌న్మించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గూడురు, నూజివీడు, నందిగామ‌, విశాఖ‌ల్లో ఆయ‌న స్కూల్ విద్యాభ్యాసం కొన‌సాగింది. ఆంధ్రా యూనివ‌ర్సిటీ నుంచి ఆయ‌న ఎంస్సీ మ్యాథ‌మెటిక్స్‌లో ప‌ట్టా పుచ్చుకున్నారు. 1943లో క‌ల్‌క‌త్తా యూనివ‌ర్సిటీ నుంచి ఎంఏ స్టాటిస్‌టిక్స్ పూర్తి చేశారు. గ‌ణిత శాస్త్రంలో పీహెచ్‌డీ కోసం ఆయ‌న బ్రిట‌న్ వెళ్లారు. స‌ర్ రోనాల్డ్ ఏ వ‌ద్ద ఆయ‌న పీహెచ్‌డీ చేశారు. 1965లో క్యాంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీకి చెందిన కింగ్స్ కాలేజీలో డీఎస్సీలో డిగ్రీ చేశారు. తొలుత ఆయ‌న ఇండియ‌న్ స్టాటిస్‌టిక‌ల్ ఇన్స్‌టిట్యూట్‌, క్యాంబ్రిడ్జ్ ఆంథ్రోపోలాజిక‌ల్ మ్యూజియంలో ప‌నిచేశారు.భార‌త్‌కు వ‌చ్చిన ఆయ‌న ఆ త‌ర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్‌టిక్స్‌ను ప్రారంభించారు. ఆ త‌ర్వాత అనేక కీల‌క ప‌ద‌వుల్లో ఆయ‌న చేశారు. ఇండియ‌న్ స్టాటిస్‌టిక‌ల్ ఇన్స్‌టిట్యూట్‌కు డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. 1968లో ఆయ‌న‌కు భార‌త ప్ర‌భుత్వం ప‌ద్మ భూష‌ణ్‌, 2001లో ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాల‌ను అంద‌జేసింది. 2002లో జార్జ్ బుష్ నుంచి ఆయ‌న నేష‌న‌ల్ మెడ‌ల్ ఆఫ్ సైన్స్ అందుకున్నారు. స్టాటిస్‌టిక్ టెక్నిక్‌ల‌ను అభివృద్ధి చేయ‌డంలో ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు. క్రామెర్‌-రావు ఇనిక్వాలిటీ, రావు-బ్లాక్‌వెల్ థియరీ లాంటి టెక్నిక్‌ల‌ను ఆయ‌న డెవ‌ల‌ప్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.