త్వరలో తమ డిమాండ్ల సాధన కొరకు మీసేవ నిర్వాహకుల బంద్..??

.. నేటికీ నెరవేరని మంత్రి కేటీఆర్ హామీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీసేవ నిర్వాహకులు తమ డిమాండ్ల సాధనకై బంద్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ ఖైరతాబాద్ హిందీ దక్షిణ ప్రచార సమితి భవనంలో రాష్ట్ర మీ సేవ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ 33 జిల్లాల నిర్వాహకులతో కన్వీనర్ రాములు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మీసేవ నిర్వాహకులు మాట్లాడుతూ 13 డిసెంబర్ 2017 పది కోట్ల లావాదేవీలు పూర్తి చేసుకున్న సందర్భంగా రవీంద్రభారతిలో మీసేవ నిర్వాహకులు నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఐటి శాఖ మంత్రి కేటీఆర్ మీసేవ నిర్వాహకులను సామాజిక ఇంజనీర్లుగా కొనియాడారు దీంతోపాటు వారి సేవలను గుర్తించి మీసేవ నిర్వాహకులకు ఉచిత ఇంటర్నెట్, విద్యుత్ బిల్లు నిర్వాహకుల కుటుంబాలకు హెల్త్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారు కానీ ఆ హామీ నేటికీ నెరవేరలేదు అదేవిధంగా తమ డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో 2018లో మీసేవ నిర్వాహకులు రాష్ట్రవ్యాప్త బందుకు పిలుపునివ్వడంతో అధికారులు పాలకులు ఎన్నికల తర్వాత మీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో నిర్వాహకులు బంద్ విరమించుకున్నారు. కానీ నేటి వరకు డిమాండ్లు మాత్రం పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మీసేవ నిర్వాహకులు రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు .అదేవిధంగా సమస్యల పరిష్కార సాధన కోసం ఈ సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఓ నిర్ణయానికి వచ్చింది.

నేటికీ రాష్ట్రవ్యాప్తంగా మీసేవ నిర్వాహకులు 17 కోట్ల 85 లక్షల 65 వేల 857 లావాదేవీలు నిర్వహించి ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తూ మరోవైపు ప్రభుత్వం ప్రవేశపడుతున్న సంక్షేమ పథకాల అమలులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ సైతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు వేల పైచిలుకు మీసేవ నిర్వాహకులు ప్రజలకు సేవలు అందిస్తూ ప్రభుత్వానికి సైతం ఎంతో పేరు తీసుకొస్తున్నామన్నారు. దీంతోపాటు మీ సేవల ద్వారా ప్రభుత్వానికి ఎన్నో అవార్డులు సైతం వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంత చేసినా మీసేవ నిర్వాహకులు మాత్రం చాలీచాలని కమిషన్లతో పనిచేస్తున్నారని ఆవేదన వెళ్లగక్కారు.దీంతో పాటు పెరిగిన స్టేషనరీ చార్జీలు, సర్వీసుల పెంపు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు . అంతేకాకుండా ప్రస్తుతం మీసేవ లకు సంబంధించిన ఈ ఎస్ డి కమిషనర్ సైతం లేకపోవడంతో నిర్వాహకులు సమస్యలు ఎదుర్కొంటున్నారు దీంతో రాబోయే రోజుల్లో తమ డిమాండ్ల సాధనకై చేపట్టవలసిన కార్యచరణకు ఈ సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.. ఈ సమావేశంలో మీసేవ నిర్వాహకుల రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు తెలంగాణ 33 జిల్లాల మీసేవ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.