ఎంఐఎం నేతల్లారా…. దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయండి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రజల్లో హిందుత్వ వాతావరణం వచ్చింది. 80 శాతం జనాభా ఉన్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారబోతున్నరు. అందుకే ఎంఐఎంతో సంబంధం లేదన్నట్లుగా అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. ఈ వేదికగా ఎంఐఎంకు సవాల్ చేస్తున్నా…. మీకు దమ్ముంటే, ముస్లిం సమాజం కోసమే పనిచేస్తున్నామని భావిస్తే… రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయండి. మీకు డిపాజిట్లు రాకుండా చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోతోందని, ఆ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లేనని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఒక్కటవుతున్నాయని, అయినా వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, రామరాజ్యాన్ని స్థాపించడం తథ్యమన్నారు. రాష్ట్రంలో 4గురు జిల్లా కలెక్టర్లు ధరణి పేరుతో అడ్డగోలుగా సంపాదించి కేసీఆర్ కుటుంబానికి దోచి పెడుతున్నారని, అందుకు ప్రతిఫలంగా ప్రమోషన్లు పొందుతున్నారని మండిపడ్డారు. ఆ ఆధారాలను సేకరిస్తున్నామని, త్వరలోనే వారి బండారాన్ని బయటపెడతామని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వసక్తే నిలువ నీడలేని పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని, పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా యోజన కింద నష్ట పరిహారం అందజేస్తామని, అర్హులందరికీ నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని చెప్పారు. 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగుల సందర్భంగా ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపినిచ్చారు.

• ప్రజా గోస – బీజేపీ భరోసాలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మన్నెగూడ వేద కన్వెన్షన్ లో నిర్వహించిన 11 వేల శక్తి కేంద్రాల సభల్లో పాల్గొనే స్పీకర్ల వర్క్ షాప్ కార్యక్రమంలో బండి సంజయ్ ముగింపు ప్రసంగం చేశారు. జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, మాజీ మంత్రులు బాబూమోహన్, విజయరామారావు, మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగిస్తూ..

• తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఈనెల 10 నుండి 25 వరకు దేశంలో చరిత్ర స్రుష్టించే విధంగా శక్తి కేంద్రాల పరిధిలో 11 వేల కార్నర్ మీటింగ్స్ నిర్వహించబోతోంది.

• బీజేపీకి తెలంగాణలో ఎందుకు అధికారం ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. ఈ శిక్షణలో పాల్గొన్న వక్తలంతా స్ట్రీట్ కార్నర్ మీటింగులలో చెప్పాలి.

• శ్యామా ప్రసాద్ 370 ఆర్టికల్ రద్దు కోసం ప్రాణత్యాగం చేశారు. ఆ మహనీయుడి స్పూర్తితో బీజేపీ పనిచేస్తోంది. ఈ దేశం గురించి, పరిస్థితుల గురించి, ప్రజల బాగోగుల గురించి చర్చించాలనే ఆలోచన ఇతర రాజకీయ పార్టీలకు లేదు. ఎంత సేపు అధికారంలోకి ఎలా రావాలి? ఎట్లా సంపాదించాలి? అడ్డదారిలో అధికారం ఎలా సంపాదించాలనే యావ మాత్రమే ఆ పార్టీలకు ఉంది.

• సిద్ధాంతం కోసం పనిచేస్తున్న బీజేపీ తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చి నరేంద్రమోదీ గారి పాలనను కొనసాగించాలనే క్రుత నిశ్చయంతో ముందుకు వెళుతున్నాం.

• స్ట్రీట్ కార్నర్ మీటింగులేంటి… వంద, 200 మందితో మీటింగులెందుకు? అనుకోవద్దు… వాజ్ పేయి, అద్వానీ వంటి వారు 10, 20 మందితో సభలు పెట్టారు. వాళ్లే కుర్చీలు, టేబుల్ వేసుకుని మైకులు తెచ్చుకునేవారు. పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు.

• వారి స్పూర్తితో 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తున్నాం. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం, బీజేపీ పోరాడుతున్న తీరును వివరించాలి. అదే సమయంలో కేంద్ర విజయాలను వివరించాలి.

• తెలంగాణలో ఏడాదిలో 15 బహిరంగ సభలు నిర్వహించి చరిత్ర స్రుష్టించిన పార్టీ బీజేపీ మాత్రమే. అమిత్ షా 3 సార్లు, 3 సార్లు మోదీ, 4 సార్లు నడ్డా వచ్చారంటే.. తెలంగాణ పై ఎంత అభిమానం ఉందో, కార్యకర్తలంటే ఎంతటి అభిమానమో గుర్తుంచుకోవాలి.

• ఇతర రాజకీయ పార్టీలు నాయకులుగా తీర్చిదిద్దడానికి వెనుకాడుతాయి. వాళ్లే లీడర్లుగా కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు. బీజేపీ అందుకు భిన్నంగా కొత్త లీడర్లను తయారు చేయడమే లక్ష్యంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు పెడుతున్నాం.

• బీజేపీపట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. గత ఎన్నికల్లో ఒకే ఎమ్మెల్యే స్థానానికి పరిమితమయ్యాం. ఆ తరువాత 4 ఎంపీ స్థానాల్లో గెలిచాం. బీజేపీ ఎంత? గింత పార్టీ అని హేళన చేశారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో 2 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్నాం. 25 శాతం జనాభా కలిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలను గెలుచుకుని బీజేపీ దమ్ము చూపించాం. ఆ తరువాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచి ప్రత్యామ్నాయంగా నిలిచాం.

• కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయింది. కాంగ్రెస్ కు ఓటేస్తే తిరిగి టీఆర్ఎస్ లోకి పోతారని, సీఎల్పీ పూర్తిగా టీఆర్ఎస్ పక్షాన ఉందనే భావన ప్రజల్లో నెలకొంది. పోరాడే బీజేపీ ప్రత్యామ్నాయంగా భావించి ఆదరిస్తున్నారు.

• ప్రజల నమ్మకుండా వమ్ము చేయకుండా బీజేపీ అనేక ఉద్యమాలు చేస్తోంది. అవినీతి పాలనను అంతమొందించాలని, నయా నిజాం పాలనకు చరమగీతం పాడేందుకు పోరాడుతోంది. బీజేపీ పోరాటాల ఫలితంగానే బీజేపీ తెగించి కొట్లాడే పార్టీ, త్యాగాలకు, ప్రాణాలిచ్చేందుకు వెనుకాడని పార్టీ బీజేపీ అనే విశ్వాసం ప్రజల్లో ఏర్పడింది.

• అందరం కలిసి 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను విజయవంతం చేస్తే బీజేపీ సునాయసంగా గెలిచి అధికారంలోకి వస్తుంది. ఈ అద్బుత సన్నివేశం కోసం ఎంతో మంది కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. దశాబ్దాల తరబడి ఎందరో పార్టీ కోసం త్యాగం చేశారు. అరెస్టై జైళ్లకు వెళ్లారు. ప్రాణాలు వదిలారు. వారి త్యాగాలను గుర్తించాల్సిన అవసరం ఉంది.

• జాతీయ జెండాను అవమానించేటోళ్లు ఈ దేశంలో ఇంకా ఉన్నారు. జాతీయత, దేశ ప్రజల గురించి ఆలోచించని పార్టీలు అధికారాన్ని చెలాయిస్తున్నాయి. కానీ బీజేపీ కార్యకర్త సామ జగన్మోహర్ రెడ్డి జాతీయ జెండా కోసం భారత్ మాతా కీ జై అంటూ నక్సలైట్లకు బలయ్యారు. భరత్ గౌడ్ తండ్రి మైసయ్య గౌడ్ హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారనే కోపంతో ఇస్లామిక్ తీవ్రవాదులు వార్నింగ్ ఇచ్చినా కాషాయ జెండాను ఏనాడూ దించలేదు. ప్రాణాలనే త్యాగం చేసిన వీరుడు. వాళ్లందరి లక్ష్యం అధికారంలోకి రావాలన్నదే. జాతీయ వాదులకు అధికారం రావాలన్నదే వారి ఆకాంక్ష. ప్రజలను ఆదుకోవాలి. సమాజాన్ని బాగుపర్చాలి. రాష్ట్రాన్ని అభివ్రుద్ధి చేసుకుని నీతివంతమైన పాలన అందించాలన్నదే ఆ త్యాగధనుల కోరిక.

• ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఆశ అందరిలో ఉంది. కేసీఆర్ పై యుద్దం చేస్తున్నం. ఫాంహౌజ్ లో ఉన్న కేసీఆర్ ను బయటకు లాక్కొచ్చి పిచ్చి లేచి తిరిగేలా చేస్తున్నడంటే బీజేపీ వల్లే. బీఆర్ఎస్ పార్టీ పేరుతో దేశమంతా తిరుగుతుంటే… ఆ అవసరం ఎందుకొచ్చిందనే అంశంపై దేశమంతా చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ బంధం తెగిపోయింది… బీజేపీ సర్కార్ రాబోతోంది కాబట్టే బీఆర్ఎస్ పేరుతో కొత్త దుకాణం పెట్టి దేశమంతా తిరుగుతున్నారనే చర్చ ప్రజల్లో జరుగుతోంది.

• కేసీఆర్ లో భయం నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదు? తెలంగాణకు చేసిన మేలు ఏమిటో చెప్పడం లేదు. నాందెడ్ సభలో పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ అబద్దాలను చూసి నవ్వుకుంటున్నరు.

• క్రిష్ణా జలాలను ఆంధ్రోళ్లకు అప్పగించారు. ఎస్సారెస్పీ నుండి నీళ్లు ఎత్తిపోసుకోవాలని గోదావరిని మహారాష్ట్రకు అప్పగిస్తున్నడు. విభజన సమయంలో 575 టీఎంసీ క్రిష్ణా నీటి వాటా తెలంగాణకు రావాల్సి ఉంటే… 290 టీఎంసీలకు అంగీకరించి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టారు.

• తెలంగాణలో 18 లక్షల బోర్లుంటే… ఈరోజు 28 లక్షల బోర్లు పెరిగాయి. ప్రాజెక్టులు కడితే బోర్ల సంఖ్య ఎందుకు పెరుగుతుందో చెప్పాలి. ఉత్తర ప్రదేశ్ లో 19 వేల కోట్లు ఖర్చు చేసి 63 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చి మంచి నీళ్లు ఇస్తున్నారు. రాష్ట్రంలో 40 వేల కోట్లు ఖర్చు చేసి ప్రజలకు మంచి నీళ్లు ఇవ్వడం లేదు.

• కేసీఆర్ రుణమాఫీ, నిరుద్యోగ భ్రుతి, 317 జీవో, ఉద్యోగాల భర్తీ, సబ్సిడీల గురించి మాట్లాడటం లేదు. పాఠశాలల్లో కనీస సౌకర్యాల్లేవు. చాక్ పీసులకు పైసల్లేవు. టాయిలెట్లు లేవు. స్కావెంజర్లు లేరు. చివరకు సరైన తిండి దొరకక ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రి పాలయ్యే దుస్థితికి తీసుకొచ్చారు.

• కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఏళ్లు దాటినా అమలు లేదు. బిశ్వాల్ కమిషన్ 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పినా ఇప్పటి వరకు 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు.

• కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం గత మూడు నెలల్లో 2.16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది. ఈ ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతోంది.

• రాష్ట్రంలో విలువైన భూములను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారు. 4గురు జిల్లా కలెక్టర్లు ధరణి పేరుతో అడ్డగోలుగా సంపాదించి కేసీఆర్ కుటుంబానికి దోచి పెడుతున్నారు. వాళ్లకే ప్రమోషన్లు ఇస్తున్నారు. ఆ ఆధారాలను సేకరిస్తున్నాం. ఆ రిపోర్ట్ బయటపెడితే ఇజ్జత్ పోతది..

• ఆ కలెక్టర్లకు వార్నింగ్ ఇస్తున్నాం… ప్రజల సొమ్ము ను దోచుకుని కేసీఆర్ కుటుంబానికి దోచిపెడుతున్నారు. వారి సంగతి చూస్తాం.

• నిలువ నీడలేని పేదలందరికీ ఇల్లు కట్టిస్తాం. పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా యోజన కింద నష్ట పరిహారం అందజేస్తాం. అర్హులందరికీ నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తాం. ఈ అంశాలన్నింటినీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

• నిరాశ చెందే నాయకులను పట్టించుకోవద్దు. ధైర్యంగా పనిచేస్తూ లక్ష్యాన్ని చేధించాలి. కసి ఉండాలి. పిరికితనంతో నిరాశతో ఉంటే లక్ష్యాన్ని చేరుకోలేం.

• సెంటిమెంట్ తో గెలిచి దోచుకుంటున్న బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ పాలక్, విస్తారక్, ప్రభారీల గురించి ఏం తెలుసు? ప్రజల ఆస్తులను దోచుకుని విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నరు. లిక్కర్ దందా చేస్తున్నరు. కాంగ్రెస్ గాలిలో గెలిచింది. బీజేపీ మాత్రం సంస్థాగతంగా బలోపేతమై ప్రజల మనసులు గెలుచుకుని అధికారంలోకి వస్తోంది. దేశంలో నరేంద్రమోదీ 3వ సారి కాదు.. 4వ సారి కూడా కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నారు.

• వచ్చిన అధికారాన్ని సంవత్సరాల తరబడి కాపాడుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ పేదల్లేని సమాజ నిర్మాణం కోసం క్రుషి చేయాలి. అందుకోసమే బీజేపీ అంచెలవారీగా సంస్థాగత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళుతోంది.

• ప్రజా సంగ్రామ యాత్ర చేసినం… భరోసా యాత్ర చేసినం… నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తున్నం. పోరాడుతున్నం. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, కార్మికుల సమస్యలపై వెంటనే స్పందించి వారి తరపున పోరాడుతున్న పార్టీ బీజేపీ.

• మొన్నటికి మొన్న సర్వే చేస్తే తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని తేలింది. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా తప్పుడు నివేదికలతో మీడియాలో బీఆర్ఎస్ గెలుస్తోందంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

• మీడియాను కేసీఆర్ నయానోభయానో తన గుప్పిట్లో పెట్టుకున్నారు. వాజ్ పేయి, అద్వానీ హయాంలో మౌత్ క్యాంపెయిన్ ద్వారానే అధికారంలోకి వచ్చారు. మోదీగారు కూడా మౌత్ క్యాంపెయిన్ ద్వారానే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. దానిని విస్త్రతంగా ఉపయోగించండి. మీడియా సైతం కేసీఆర్ కబంధ హస్తాల నుండి బయటపడే రోజులు రాబోతున్నయ్..

• టీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో మీటింగ్ లు పెట్టే దమ్ము లేదు. కాంగ్రెస్ కు కార్యకర్తలే లేరు. బీజేపికి ఆ సత్తా ఉంది కాబట్టే 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తున్నాం. ఆ తరువాత అసెంబ్లీ వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాం. ఆ తరువాత జిల్లా స్థాయిలో భారీ బహిరంగ సభలు నిర్వహించి బీఆర్ఎస్ మోసాలను ప్రజల్లో ఎండగడతాం. కేంద్ర విజయాలను వివరిస్తాం…

• ఈ 8 నెలలు కష్టపడి పనిచేద్దాం. ప్రతి ఒక్కరూ పూర్తి సమయం పార్టీ కోసం వెచ్చించండి. లేకుంటే కేసీఆర్ మరో రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేస్తారు.

• రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. అయినా సిగ్గు లేకుండా అబద్దాలాడుతున్నడు. కేసీఆర్ వల్ల డిస్కంలు పూర్తిగా నష్టపోయాయి. బకాయిలు ఇవ్వడం లేదు.

• ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణలో మొత్తం ఇండ్లు కట్టించానని కేసీఆర్ తప్పుడు సమాచారం కేంద్రానికి పంపారు. నేను ఫిర్యాదు చేస్తే కేంద్రం లబ్ది దారుల జాబితా పంపాలని మూడు సార్లు లేఖ రాసినా స్పందించలేదు. అయినా ఒత్తిడి చేస్తే మీ పైసలే మాకు అక్కర్లేదన్నడు… కేంద్ర మంత్రి … ఇచ్చిన డబ్బులకు వడ్డీతో సహా చెల్లించాలని నోటీసులు జారీ చేశారు.

• పెద్ద పెద్ద భవంతులు, కొబ్బరి చెట్ల గ్రాఫిక్స్ ను స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో చూపే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఇండ్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని ఇండ్లు కట్టి లబ్దిదారులకు అందజేశారనే వివరాలివ్వాలని నిలదీస్తే… 7 వేలకుపైగా ఇండ్లు మాత్రమే నిర్మించినట్లు చెప్పారు. మరి కేంద్రం 2.4 లక్షల ఇండ్ల నిర్మాణానికి ఇచ్చిన నిధులు ఏం చేసినట్లు?

• స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో ఈ విషయాలన్నీ చెప్పాలి. అట్లాగే స్థానిక సమస్యలను ముందే సేకరించి స్పందించాలి. ఆయా సమస్యలపై స్థానికంగా పోరాటాలు చేయాలి. కలిసి పనిచేద్దాం… తెలంగాణలో రామరాజ్య స్థాపనకు స్ట్రీట్ కార్నర్ మీటింగులే పునాది కావాలి. రజాకార్ రాజ్యం పోవడమే లక్ష్యంగా పనిచేయాలి.

• ప్రజల్లో హిందుత్వ వాతావరణం వచ్చింది. 80 శాతం జనాభా ఉన్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారబోతున్నరు. అందుకే ఎంఐఎంతో సంబంధం లేకుండా చేసే కుట్ర చేస్తున్నారు. ప్రజల్లో విద్వేషాలు రగిలించేందుకు ఎత్తుగడ వేస్తున్నారు.

• ఎంఐఎంకు సవాల్ చేస్తున్నా…. మీకు దమ్ముంటే, ముస్లిం సమాజం కోసమే పనిచేస్తున్నామని భావిస్తే… రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తావా? మీకు డిపాజిట్లు రాకుండా చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.

• సరస్వతి అమ్మవారిని, దేవుళ్లను కించపరిస్తే మౌనంగా ఉంటే బీజేపీ కార్యకర్తలే కాదు.. హిందువులే కాదు. అయ్యప్పను కించపర్చిస్తే, కాషాయ జెండాను కించపరిస్తే స్పందించే పార్టీ బీజేపీ మాత్రమే.

• రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఓడించేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రజల్లో పలుకుబడి లేని, కళ్లులేని, కాళ్లులేని, ఓట్లు పడని, చేతగాని నాయకులను తీసుకొచ్చి బీఆర్ఎస్ లో చేర్చుకుంటూ కేసీఆర్ రాజకీయ డ్రామాలాడుతున్నరు. అయినా వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. బీజేపీని అదికారంలోకి తీసుకొచ్చేదాకా విశ్రమించే ప్రసక్తే లేదు.

Leave A Reply

Your email address will not be published.