మరో నాలుగు రోజులు ఐసీయూలోనే ఎంపీ ప్రభాకర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మెదక్‌ ఎంపి, దుబ్బాక బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి మరో 4 రోజులు ఐసియులోనే చికిత్స పొందనున్నారు. ఎంపి ప్రభాకర్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో సిద్ధిపేట పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రాజకీయ కుట్ర కోణంలో విచారణ చేపట్టారు.కొత్త ప్రభాకర్‌ రెడ్డి సోమవారం సిద్దిపేట జిల్లా సూరంపల్లిలో ప్రచారం నిర్వహించి తిరిగొస్తూ వాహనం వైపు వెళుతుండగా, రాజు అనే వ్యక్తి వచ్చి తనవద్ద ఉన్న కత్తితో ప్రభాకర్‌ రెడ్డి కడుపులో పొడిచాడు. వెంటనే ప్రభాకర్‌ రెడ్డిని మొదట గజ్వేల్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు. కత్తిపోటుతో ప్రభాకర్‌ రెడ్డి చిన్నపేగుకు గాయం కావడంతో యశోద ఆసుపత్రిలో వైద్యులు నాలుగు గంటలపాటు శ్రమించి ఆపరేషన్‌ చేశారు. చిన్న పేగును 10 సె.మీ వరకు తొలగించారు. ప్రస్తుతం ప్రభాకర్‌ రెడ్డికి ఐసియులో చికిత్స అందుతోంది. మరో నాలుగు రోజులు ఐసియులో ఉండనున్నారు. శస్ర్త చికిత్స పూర్తయిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆసుపత్రికి వచ్చి ప్రభాకర్‌ రెడ్డిని పరామర్శించారు.ఇదిలా ఉండగా … ఎంపిపై కత్తితో దాడి చేసిన నిందితుడు రాజు కుటుంబ సభ్యులను చేప్యాలలోని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. రాజు కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు రాజుకి హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడు కోలుకున్న తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో బంద్‌కు బిఆర్‌ఎస్‌ నేతలు పిలుపునిచ్చారు. వర్తక వ్యాపారులు స్వచ్చందంగా బంద్‌ పాటిస్తున్నారు. అదే విధంగా ఎంపి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మెదక్‌ చర్చిలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.