ఎస్ఎన్డిపి తో నాలా అభివృద్ధి కార్యక్రమం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న వరదముంపు సమస్య సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం ఎస్ఎన్డిపి తో శాశ్వతంగా పరిష్కారం అవుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్ లో గల పికెట్ నాలా పై ఎస్ఎన్డిపి కార్యక్రమం క్రింద 10 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఎస్ఎన్డిపి కార్యక్రమం క్రింద చేపట్టిన అభివృద్ధి పనులలో నిర్మాణం పూర్తయిన మొదటి నిర్మాణం ఈ బ్రిడ్జి. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ సాయన్న, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జిహేచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, కార్పొరేటర్ లు మహేశ్వరి, కోలన్ లక్ష్మి, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, ఉప్పల తరుణి, ఎస్ఎన్డిపి సిఇ కిషన్, SE భాస్కర్ రెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వాటర్ వర్క్స్ GM రమణారెడ్డి , ట్రాపిక్ ACP జ్ఞానేందర్ రెడ్డి, సిఐ లింగేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎగువ నుండి వరద తో పికెట్ నాలా పరిసర కాలనీల ప్రజలు ముంపుకు గురై అనేక ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఎస్ఎన్డిపి క్రింద 10 కోట్ల రూపాయల వ్యయంతో నాలా పై గతంలో ఉన్న దానికన్నా ఎత్తులో, వెడల్పు తో నూతన బ్రిడ్జి నిర్మించడం జరిగిందని వివరించారు. ఈ పనులను అనుకున్న సమయానికి ముందే పూర్తి చేయడం పట్ల మంత్రి అధికారులను అభినందించారు. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ రహదారిలో నాలా పై బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా వాహనదారులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేసిన ట్రాపిక్ పోలీసులను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి కి నోచుకోని నాలాల తో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే గట్టి సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటిఅర్ ఆధ్వర్యంలో ఎస్ఎన్డిపి కార్యక్రమం కు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.

Leave A Reply

Your email address will not be published.