ధరణి పోర్టల్ లో మారిపోతున్ననిజమైన పట్టాదారు రైతుల పేర్లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రెవెన్యూ కార్యాలయాలకు ఇక రోజుల కొద్దీ తిరగనక్కర్లేదు.. ఆఫీసర్ల కోసం వేచి చూడనక్కర్లేదు.. ఒక్కరోజులో మీ సమస్యలు ఆన్ లైన్లో పరిష్కారమవుతాయి.. అంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ తో రైతులు సమస్యలు తీరడం అటుంటి.. మరిన్ని ఎక్కువవుతున్నాయి. నిజమైన పట్టాదారులుగా ఉన్న రైతులు  పేర్లు మారిపోతున్నాయి. తమ పేర్లు ఎలా మారాయని.. కరెక్షన్ చేయాలని బాధిత రైతులు తహసీల్దార్ల ఆఫీసుల చుట్టూ తిరుతున్న ఫలితం లేదు. తామేం చేయలేమంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఈ తప్పిదాలపై ఎవరిని సంప్రదించాలి..ఈ సమస్యలు ఎలా పరిస్కారమవుతాయి..అని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ధరణిలో పేర్ల మార్పిడి సంఘటనలు ఎక్కువగా ఖరీదైన ఏరియాల్లోనే జరుగుతున్నాయి. అప్పటి వరకు పట్టించుకోని భూములకు ఒక్కసారిగా డిమాండ్ రావడంతో కొందరు వాటిని తమ పేరున రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు.ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం శంకర్ పల్లిలో ఎక్కువగా ఇలా జరిగాయి. తాజాగా వరంగల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అందులో పాగా వేసేస్తున్నారు కొందరు. నిజమైన పట్టాదారులు అధికారులకు ఫిర్యాదు చేస్తే  ఆ ఫైళ్లు పెండింగులో ఉండేలా రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు.భూ సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు ధరణి యాప్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 33 మాడ్యూళ్లను చేర్చి ఆయా సమస్యకు పేజీకి కేటాయించారు. ప్రతీ ఫిర్యాదుకు రూ.1000 వసూళ్లు చేస్తున్నారు. అయితే రైతులు తమ సమస్యను ఎందులో ఫిర్యాదు చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.గతంలో తమ సమస్యను వీఆర్ఏ వీఆర్వో కు విన్నవించేవారు. అక్కడ పరిష్కారం కాకపోతే కలెక్టర్ స్థాయి వరకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ కావడంతో కొందరు రైతులు తమ భూమి వివరాలు తెలుసుకునేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడకముందు నుంచి పట్టాదారులుగా ఉన్నవారు ఇప్పుడు తమ వివరాలు చూసుకుంటే మారిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అంతకుముందు వారసత్వంగా జారీ అయిన పట్టా వచ్చి.. ఆ తరువాత రైతు బంధు కూడా తీసుకున్న వారు ఖాతాలో ఇప్పుడు ఇతర గ్రామానికి చెందిన వారి వివరాలు ఉండడంతో షాక్ తింటున్నారు. ఇటీవల వరంగల్ జిల్లాలో ఇవి ఎక్కువ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ ఖాతాల్లో తమ పేర్లు ఉన్నాయో.. లేవో తెలుసుకోవడానికి కార్యాలయాల బాట పడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.