ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నందమూరి తారకరత్న మృతి

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్:  ప్రముఖ హీరో నందమూరి తారకరత్న గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గుండెపోటు కారణంగా ఆరోగ్యం పాడైన ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స పొందుతున్నారు.

దాదాపు 23 రోజులుగా అక్కడే ఆయనకు వైద్యం అందుతోంది. కార్డియాక్ అరెస్ట్ తీవ్రత కారణంగా తారకరత్న శరీరంలోని పలు అవయవాలు పని చేయకుండా పోయాయి. మెదడు సైతం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే విదేశీ వైద్యుల బృందం రంగంలోకి దిగింది. ఆయనకు ప్రత్యేక వైద్యం అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. అయితే శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అత్యంత విషమంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన కన్నుమూశారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా, 23 రోజుల క్రితం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. బావమరిది యాత్రకు తన మద్దతు తెలిపారు. పాదయాత్రలో వేలాది మంది టీడీపీ కార్యకర్తలతో నడుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తారకరత్న ఉన్నట్టుండి కుప్పకూలారు. దీంతో ఆయన్ని కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసర విభాగంలో ఆయనకు రాత్రి వరకు చికిత్స అందించారు. రాత్రి అక్కడినుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తీసుకెళ్లారు. 23 రోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఇక, తారకరత్న ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఒకటో నెంబర్ కుర్రాడు’తో ఓ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2002లో తన కెరీర్ను ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు దాదాపుగా 23 సినిమాల్లో నటించారు. అమరావతి సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. సైకో పాత్రలో అద్భుతంగా నటించారు. అమరావతి సినిమాలో ఆయన నటనకు గాను నంది అవార్డును సొంతం చేసుకున్నారు. విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కూతుర్ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే, మధ్యలో కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరం అయ్యారు. 2022లో ‘ అవర్స్’ అనే ఓ వెబ్ సిరీస్లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వెబ్ సిరీస్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Leave A Reply

Your email address will not be published.