పాదయాత్రలో తొడగొట్టిన నారా లోకేష్..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. అడుగడుగునా ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలుకుతున్నారు. లోకేష్ కూడా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే.. లోకేష్‌కు వస్తున్న ఇంతటి ఆదరణను చూసి వైసీపీ ఓర్చుకోలేక అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ఏకంగా పోలీసులే రంగంలోకి దిగి పాదయాత్రలో కనీసం మాట్లాడేందుకు కూడా మైక్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారంటే లోకేష్ ఏ పరిస్థితుల్లో పాదయాత్ర చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తయితే పోలీసులే.. లోకేష్‌పైన ఐదారు కేసులు పెట్టడం గమనార్హం. ఈ వరుస చర్యలన్నీ లోకేష్ పాదయాత్రకు తీవ్ర అడ్డంకులుగా మారాయి. అయినా సరే ఎక్కడా వెనక్కి తగ్గకుండా లోకేష్ పాదయాత్ర 24 రోజులు పూర్తి చేసుకుంది.

తొడగొట్టి చెబుతున్నా..!

పోలీసులు, ప్రభుత్వం చర్యలతో విసిగిపోయిన నారా లోకేష్.. తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. శ్రీకాళహస్తిలో జరిగిన సభలో ఓర్పు, సహనాన్ని పరీక్షించకండంటూ తొడ కొట్టారు లోకేష్. ‘ చంద్రబాబు ఒక చిటికేస్తే చాలు.. వైసీపీ మూకల సంగతి ఇప్పుడే చూస్తాం.. కట్ డ్రాయర్‌తో ఊరేగిస్తాం. రాబోయేది మా టీడీపీ ప్రభుత్వమే. పోలీసులకు పోస్టింగులు ఇచ్చేది నేనే.. అది గుర్తుంచుకోండి. నన్ను ఇంతలా ఇబ్బందులు పెడుతున్నారు. మరోవైపు మా నాన్న గారు చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారు. శ్రీకాళహస్తిలోని బడా చోర్ సంగతులు అన్నీ నాకు తెలుసు. చట్టాలు కొంతమంది చుట్టాలు అవుతున్నాయి. బడా చోర్ ఏమేమి దోపిడీ చేస్తున్నాడో తెలుసు. చరిత్రను బయటకు లాగుతా. అన్నిటిపైనా తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటా. ఇక్కడ ఎమ్మెల్యే ఇసుక దోపిడీ చేస్తే కేసు ఉండదు కానీ.. నేను స్టూల్ ఎక్కి మాట్లాడితే కేసు పెడతారా..?. ఇదేం న్యాయం ’ అంటూ పోలీసు అధికారులతో నారా లోకేష్ తీవ్ర వాగ్వాదానికి దిగారు. లోకేష్ మాట్లాడుతున్నంత సేపు అభిమానులు, కార్యకర్తలు ‘జై తెలుగుదేశం.. జై జై నారా లోకేష్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.మరోవైపు.. ఇవాళ జరిగిన నారా లోకేష్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏర్పేడులోని మర్రిమంద మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో లోకేష్పై దాడి చేసేందుకు వైసీపీ మూకల ఏర్పాట్లు చేసుకున్నాయి. స్కూల్ లోపల 15 మంది దుండగులు పోగైనట్లు టీడీపీ శ్రేణులు పసిగట్టాయి. వెంటనే పోలీసులకు టీడీపీ నేతలు సమాచారం ఇచ్చారు. ఎలిమెంటరీ.. అది కూడా చిన్న పిల్లలు చదివే స్కూల్లో వైసీపీ నేతలకు ఏం పని..? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. అయితే.. వైసీపీ నేతలతో పోలీసులు చర్చించిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదు పాదయాత్ర చేసుకోవచ్చని టీడీపీ నేతలకు చెప్పడంతో కాస్త పరిస్థితి సద్దుమణిగింది. అయితే పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాయి. ‘అసలు మీరు లోకేష్ పర్యటనకు రక్షణగా వచ్చారా..? లేకుంటే వైసీపీ మూకలకు కాపలాగా వచ్చారా?’ అంటూ పోలీసులను టీడీపీ నేతలు ప్రశ్నించారు. దీంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.మొత్తానికి చూస్తే.. ఈ వరుస ఘటనలను బట్టి లోకేష్ పాదయాత్రపై వైసీపీ ఏ రేంజ్‌లో పగబట్టిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. ఆ యాత్రలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఒకవేళ ఇప్పుడు వైసీపీ వ్యవహరిస్తున్నట్లే.. అప్పుడు టీడీపీ ప్రవర్తించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో మరి.

Leave A Reply

Your email address will not be published.