ఇందిరను మించిన నియంత నరేంద్రమోదీ

- ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత దేశ సమకాలీన చరిత్ర రచనలో 1947, ఆగస్టు15 అనే లక్ష్మణరేఖను చరిత్ర అధ్యయనకారులు దాటలేకపోయారని’ ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. చరిత్ర ఏరులా పారుతుండాలి కానీ, దానికి అడ్డు గీతలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. నిజానికి భారత స్వాతంత్ర్యానంతర చరిత్ర మీద ఒకటి, రెండు మినహా..చెప్పుకోతగిన రచనలు రాకపోవడం విచారకరమన్నారు. మంథన్‌ సంవాద్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సైఫాబాద్‌లోని విద్యారణ్య పాఠశాలలో ‘భారత సమకాలీన చరిత్ర – సవాళ్లు’ అంశంపై రామచంద్ర గుహ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇందిరాగాంధీ ఎలాంటి నియంతృత్వ ఽధోరణులను అవలంభించారో, ఇప్పుడు నరేంద్రమోదీ కూడా అంతకుమించిన నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. ఒకనాడు కాంగ్రెస్‌ ఏక పార్టీగా చలామణి అయితే, ఇప్పుడే అదే బాటలో బీజేపీ నడుస్తోందని అన్నారు. దేశంలో 1947నుంచి1952 మధ్య కాలంలో కొన్ని విపత్కర పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

అలాంటి మార్పులను గడిచిన ఐదేళ్లలోనూ చూస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. ఒక సామాజిక శాస్త్ర విద్యార్థిగా చిప్కో ఉద్యమం, ఆదివాసీ జీవితాలపై పరిశోధనా రచనలు చేస్తూనే, తానెలా భారతదేశ సమకాలీన చరిత్ర రచయితగా మారారో రామచంద్ర గుహ వివరించారు. ‘ఇండియా ఆఫ్టర్‌ గాంధీ’ రచన క్రమంలో తానెదుర్కొన్న సమస్యలను తెలిపారు. ముఖ్యంగా నెహ్రూ, ఇందిరాగాంధీకి సంబంధించిన చారిత్రక పత్రాలు, దస్తావేజులను వారి కుటుంబమే బయటపెట్టలేదని చెప్పారు. దాంతో గాంధీ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన రాజాజీ వంటి ఒకరిద్దరి ఆత్మకథారచనలద్వారా తనకు కావాల్సిన సమాచారాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదే పుస్తక రచనలో.. సమకాలీన చరిత్రను కాలక్రమంలో పొందుపరచడంతోపాటు దాన్ని ఏ పద్ధతిలో చెప్పాలి అనే విషయాల పట్ల తానెక్కువ శ్రమించాల్సి వచ్చిందని ఆయన వివరించారు. చరిత్రకారులు నిష్పక్షపాతంగా ఉండాలి కానీ, ఏదో ఒకవైపు వాళ్లు పక్షపాతం వహిస్తున్నట్టు బయటివాళ్లకు అనిపించడం కూడా సహజమని చెప్పారు. ఈ మధ్యకాలంలో శాస్త్ర, సాంకేతిక తదితర రంగాలపై సమకాలీన చరిత్ర రచనలు కొన్ని వస్తుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి మంథన్‌ నిర్వాహకులు విక్రమ్‌, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్‌ కాకి మాధవరావు, విశ్రాంత ఐపీఎస్‌ అరుణ బహుగుణ, పద్మశ్రీ పురస్కార గ్రహీత శాంతాసిన్హా, హెచ్‌బీటీ గీతారామస్వామి, రచయిత్రి అమితా దేశాయ్‌, సినీనటి చందనా చక్రవర్తి తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.