మహబూబాబాద్‌ జిల్లాకు కొత్తగా ఇంజినీరింగ్ కాలేజ్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం కేసీఆర్‌ మహబూబాబాద్‌ జిల్లా కేంద్రమైన మానుకోటలో కొత్తగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. మహబూబాబాద్‌ గతంలో చాలా వెనుకబడ్డ ప్రాంతం అని, ఇప్పుడు జిల్లా అయ్యాక అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. జిల్లాకు కొత్తగా ఇంజినీరింగ్ కాలేజ్‌ ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుండే అందుబాటులోకి తెచ్చేలా చూస్తామన్నారు. ‘తెలంగాణ వచ్చాకా చాలా పనులు చేసుకున్నాం. చాలా జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం. ఇప్పుడు మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ కలెక్టరేట్‌ ప్రజాసమస్యలు తీర్చే కార్యాలయంగా మారాలి. తెలంగాణ రాకముందు 3, 4 వైద్య కళాశాలలు ఉండేవి. రాష్ట్రం ఏర్పడ్డాక అనేక కొత్త వైద్య కళాశాలలను తెచ్చుకున్నాం. మహబూబాబాద్‌కు ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ మంజూరు చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుండే అందుబాటులోకి తెచ్చేలా చూస్తాం’ అని సీఎం పేర్కొన్నారు.మహబూబాబాద్‌ జిల్లాలోని అనేక తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినట్లు సీఎం చెప్పారు. ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. దీంతో పాటు మహబూబాబాద్ పట్టణానికి రూ.50 కోట్లు, తొర్రూరు, మరిపెడ, డోర్న‌క‌ల్ కు రూ.25 కోట్లు చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుండి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మంజూరు చేసిన నిధుల్లోని ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించాలని స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు.‘తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబాబాద్‌ ప్రాంతానికి వచ్చా. అప్పుడు ఇక్కడ చాలా దారుణమైన కరువు పరిస్థితులు ఉండేవి. కండ్లకు నీళ్లు పెట్టుకుని ఏడ్చిన. పక్కన కృష్ణమ్మ ఉన్నా.. ఫలితమేమీ లేకపాయె. తుంగతుర్తి, వర్ధన్నపేట, పాలకుర్తి ప్రాంతాలు తిరిగినప్పుడు అక్కడ సగం గీకిన కాలువలు చూసి ఈ జన్మలో నీళ్లు రావు అని చాలా బాధపడ్డా. ఏటూరునాగారం వచ్చినప్పుడల్లా.. చిల్లర డబ్బులు వేసి తల్లీ గోదావరి మా నేలమీదకు ఎప్పుడొస్తావు, మా కరువు ఎప్పుడు తీరుస్తావు అంటూ దండం పెట్టుకునేవాడిని. తెలంగాణ వస్తే బంగారు మీసాలు చేయిస్తా అని కొమురువెల్లి స్వామికి మొక్కుకున్నా. స్వామి దయ, మీరు (ప్రజలు) చేసిన ఉద్యమం, మానుకోట రాళ్ల బలం అన్నీ కలిసి ఇప్పుడు అద్భుత రాష్ట్రం సాకారమైంది’ అని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.