అదానీ’కి కొత్త చిక్కులు.. రంగంలోకి సీబీఐ.. ఈడీ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అదానీ సంపద హిండెన్ బర్గ్ నివేదికకు ఒకలా.. ఆ తర్వాత ఒకలా మారింది. కరోనా కాలంలోనూ అదానీ గ్రూప్ సంస్థల వేలాది కోట్లు ఆర్జించాయి. అన్ని రంగాలు దెబ్బతిన్న అదానీ వ్యాపారం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. దీంతో అదానీ కంపెనీ షేర్ల విలువకు రెక్కలొచ్చాయి. దీంతో అదానీ సంపద అమాంతం పెరిగి పోయిన సంగతి తెల్సిందే.అయితే న్యూయార్క్ కు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ అదానీ గ్రూప్ వ్యాపారాల్లో భారీగా అవకతవకలు జరిగాయని తన నివేదికలో పేర్కొంది. అదానీ వ్యాపారం గాలిమేడలనీ ఆ సంస్థ ప్రకటించిన తర్వాతి నుంచి సీన్ రివర్స్ అయింది. అదానీ షేర్స్ కనిష్టానికి పడిపోయాయి. ఈక్రమంలోనే హిండెన్ బర్గ్ రిపోర్టుపై అదానీ సంస్థలు ఎదురుదాడికి దిగి విమర్శలు గుప్పించాయి.దీంతో ఇరువర్గాల మధ్య వాడివేడి మాటలయుద్ధం జరిగింది. ఇక అదానీ గ్రూప్ సంస్థ షేర్ల పతనాన్ని కట్టడి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. దీంతో వేల కోట్ల సంపద ఆవిరైపోయింది. కొద్ది రోజుల వ్యవధిలో ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్ ప్లేసులో ఉన్న గౌతమ్ అదానీ టాప్ 20లోని సైతం దిగజారిపోయారు. అంతేకాకుండా అదానీ ప్రతిష్ట సైతం మసక బారుతూ వస్తుంది. అదానీ గ్రూప్ లోని అవకతవకలపై విచారణ జరపాలంటూ పార్లమెంటులో కాంగ్రెస్ సహా విపక్షాలు పట్టుబట్టగా కొందరు సుప్రీం తలుపుతట్టారు. అదానీ గ్రూప్ పై దర్యాప్తుకు ఆదేశించాలని కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ సుప్రీంలో పిటిషన్ వేయగా విచారణకు స్వీకరించింది. ఎల్లుండి దీనిపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది.కాగా ఇప్పటికే పార్లమెంటులో జేపీసీ కోసం విపక్షాలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అదానీ గ్రూప్ పై వచ్చిన తీవ్ర ఆరోపణలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలని కాంగ్రెస్ నేత డాక్టర్ జయా ఠాకూర్ కోరగా సీజేఐ డీవై చంద్రచూడ్ తొలుత ఫిబ్రవరి 24 విచారిస్తామని వెల్లడించారు.అయితే ఇప్పటికే ఈ ఘటనపై రెండు పిటిషన్లు దాఖలయ్యాయని వీటి విచారణ ఫిబ్రవరి 17న ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది సీజే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ పిటిషన్లతో కలిసి దీనిని కూడా అదే రోజు విచారిస్తామని సీజేఐ తెలిపారు. కాగా అదానీ గ్రూపులో ఎల్ఐసి.. ఎస్బిఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుబడులు పెట్టడంపై విచారణ చేయాలని పిటిషన్లు కోరుతున్నారు.బహిరంగ మార్కెట్లో అదానీ షేర్ విలువ రూ. 1800లు ఉండగా ఈ రెండు సంస్థలు మాత్రం రూ.3200 చెల్లించి ఒక్కో షేర్ కొనుగోలు చేయడాన్ని వారు ప్రశ్నించారు. గౌతమ్ అదానీ.. ఆయన అనుచరులు వేల కోట్ల ప్రజా ధనాన్ని స్వాహా చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ.. ఈడీ.. సెబీ.. ఆర్బీఐ సంస్థలతో దర్యాప్తుకు ఆదేశించాలని పిటిషన్ తరుపు న్యాయవాది కోరారు.

Leave A Reply

Your email address will not be published.