తెలంగాణ బీజేపీలో కొత్త లొల్లి.. రంగంలోకి దిగిన బండి సంజయ్‌.. నేతలకు స్వీట్‌ వార్నింగ్‌..

Telangana-BJP.JPG

కాన్సెప్ట్‌ ఏదయినా సరే చివరి పంచ్‌ ఉంటే ఈ కిక్కే వేరప్పా అన్నట్లు సాగుతోంది తెలంగాణ రాజకీయాలు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎవరికి వారే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇక బీజేపీలోనూ అదే మొదలైంది. ఇప్పటి నుంచి టికెట్ల లొల్లి మొదలైంది. బీజేపీ నేతలు నియోజకవర్గాల్లో తమదైన శైలిలో సవాళ్లు విసిరే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారనే చెప్పాలి. వీరి వ్యవహారమే రాష్ట్రంలో కొత్త రచ్చకు కారణమైంది. ఓ పద్దతి లేకుండానే వ్యవహస్తున్నారనే విమర్శలు సొంత గూటిలోనే తలెత్తుతున్నాయి. ఒక వైపు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటం, మరో వైపు రాష్ట్రంలో పార్టీని మరింతగా బలోపేతం చేయడం, అలాగే ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి లాగేందుకు దృష్టి పెట్టిన రాష్ట్ర పార్టీకి కొంత తలనొప్పులు ఎదురవుతున్నాయి. సొంతింట్లోనే ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరించడం ఇప్పుడు పార్టీకి మరిన్ని చిక్కులు తెచ్చి పెడుతుందనే చెప్పాలి.

రంగంలోకి దిగిన బండి సంజయ్‌

ఇలాంటి వ్యవహారాల్లో రచ్చ చేస్తున్నది కొందరు సీనియర్లు ఉండటంతో రాష్ట్ర సారధి బండి సంజయ్‌ రంగంలోకి దిగారు. దీంతో రాష్ట్రంలో పార్టీ రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. ఇక సీనియర్‌ నేతలు, అభ్యర్థులగా చెప్పుకొంటున్న నేతలకు బండి సంజయ్‌ సుతిమెత్తని వార్నింగ్‌ ఇచ్చారు. బీజేపీ నుంచి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఇటీవల కొంత మంది నాయకులు ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తున్నారని, సీనియర్‌ నేతలతో పాటు నియోజకవర్గల్లో పలువురు నాయకులు సైతం వచ్చే ఎన్నికల్లో టికెట్‌ నాకే అంటూ ప్రకటనలు చేసుకుంటున్నారంటూ, ఈ విషయాలన్ని పార్టీ దృష్టికి వచ్చినట్లు సంజయ్‌ కాస్త గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యవహారాలను వెంటనే చెక్‌ పెట్టాలని, లేకపోతే మొదటికే మొసమోస్తుందని భావించి తన ప్రయత్నాలు మొదలుపెట్టారని పార్టీలోని కొందరి నేతల ద్వారా సమాచారం.

ఆ విషయంలో హైకమాండ్‌దే తుది నిర్ణయం

బీజేపీలో ఇలాంటి కల్చర్‌ మంచిది కాదని, టికెట్‌ కేటాయింపుల అంశంలో, ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలోనూ హైకమాండ్‌దే తుది నిర్ణయమని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. అభ్యర్థిత్వంపై ఎవరికివారు.. అనాలోచితంగా ప్రకటనలు చేయడం.. ఇక్కడ కుదరదంటూ స్పష్టం చేశారు. ఇండైరెక్ట్‌ మాటలతో సీనియర్ల దూకుడుకు బ్రేకులు వేస్తున్నారని తెలిసిపోతుంది.

బీజేపీలో చేరే ఇతర పార్టీల నాయకులు వెనుకడుగు

అయితే రాష్ట్రంలో బీజేపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల బీజేపీ తీర్థం పుచ్చుకునే ఇతర పార్టీల నేతలు ఒక్కసారిగా వెనుకడుగు వేస్తున్నారట. దీంతో సొంత కుంపటిలోనే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ముందు నుంచి బండి సంజయ్‌ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ తరపున ఆశావాహులు ఎవరు..? అనే జాబితా సైతం బీజేపీ అధిష్టానం వద్ద ఉంది. ఇందులో మరి కొన్ని పేర్లను జాత చేసి, అందులోనూ స్కానింగ్‌లు,స్క్రూట్నిలు చేసి ఫైనల్‌గా పేర్లను ఖరారు చేయనుంది హైకమాండ్‌. అంతేకాదండోయ్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు అనే దానిపై కూడా అధిష్టానం సర్వే చేస్తుందట.

బండి సంజయ్‌ వార్నింగ్‌తో సీనియర్లు వెనక్కి తగ్గుతారా..?

ఇప్పటికే పార్టీ తరపున ఆశావాహులు ఎవరెవరు? అనే జాబితా మొత్తం అధిష్టానం దగ్గర ఉంది. దానికి, కొత్తగా చేరే వారి పేర్లను జతపరిచి.. ఆ తర్వాత రకరకాల స్కానింగులు, స్క్రుటినీలు జరిపాక… ఫైనల్‌ డెసిషన్‌ ఉంటుంది. అభ్యర్థులపై సర్వే కూడా చేస్తుందట బీజేపీ అధిష్టానం. దీంతో నేతలు కాస్త కంట్రోల్లో ఉండాలన్నది బండి సంజయ్‌ మాట. మరి బండి సంజయ్ వార్నింగ్‌తో సీనియర్లు ఏమైనా వెనక్కి తగ్గుతారా..?లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి నుంచి టికెట్ల లొల్లి ఇలా ఉంటే.. ఇక మున్ముందు ఎలా ఉంటుదనేది వేచి చూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.