నేటి నుంచి కొత్త రూల్స్..మారే 12 అంశాలు ఇవే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  నవంబర్ నెల వచ్చేసింది. వస్తూవస్తూనే కొత్త రూల్స్ కూడా తీసుకువచ్చింది. ఈ రోజు నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. దీంతో ప్రజలపై నేరుగా ప్రభావం పడనుంది. ఇన్సూరెన్స్ కొనుగోలు దగ్గరి నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వరకు చాలా అంశాలు మారాయి. దీని వల్ల కొంత మందికి ఊరట కలిగితే.. మరికొంత మందిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఏ ఏ రూల్స్ నవంబర్ 1 నుంచి మారాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏ కేవైసీ తప్పనిసరి రూల్ తీసుకువచ్చింది. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఇది తప్పనిసరి. ప్రస్తుతం ఇది లైఫ్ ఇన్సూరెన్స్‌కు మాత్రమే తప్పనిసరిగా ఉండేది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర మారింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు రూ. 115 మేర పడిపోయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌కు ఇది వర్తిస్తుంది. ఇక డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే కొనసాగుతూ వస్తోంది.  జీఎస్‌టీ రిటర్న్స్‌లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు రూ. 5 కోట్లకు లోపు టర్నోవర్ కలిగిన ట్యాక్స్‌పేయర్లు అందరూ తప్పనిసరిగా నాలుగు అంకెల హెచ్ఎస్ఎన్ కోడ్ ఎంటర్ చేయాల్సిందే. ఇదివరకు వీళ్లు 2 డిజిట్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఎంటర్ చేసే వారు. ఇక రూ. 5 కోట్లకు పైన టర్నోవర్ ఉంటే రూ. 6 డిజిటల్ కోడ్ ఎంటర్ చేయాలి. పీఎం కిసాన్ రైతులు వారి స్టేటస్ చెక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్ ఉండాల్సిందే. ఎందుకంటే మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఇదివరకు మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఉంటే సరిపోయేది. ఢిల్లీ ఎయిమ్స్‌లో కొత్త మార్పులు వస్తున్నాయి. రూ. 300 వరకు యుటిలిటీ చార్జీలు ఉండవు.

అలాగే కొత్త ఓటీపీ కార్డు పొందేందుకు రూ. 10 ఫీజు కూడా తొలగించారు. గూడ్స్ రవాణాకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తోంది భారతీయ రైల్వే. నవంబర్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. అన్ని రకాల వేగన్లకు ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానుంది. మిలిటరీ ట్రాఫిక్, ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల సమయంలో మినహాయింపు ఉంటుంది. నేటి నుంచి భారతీయ రైల్వే కొత్త టైమ్‌టేబుల్ ప్రకారం అనేక రైళ్ల టైమ్ టేబుల్ మారనుంది. అందువల్ల మీరు రైలు సమయాలు కచ్చితంగా తెలుసుకోండి. ఇంతకుముందు ఈ మార్పులు అక్టోబర్ 1 నుంచి అమలు చేయవలసి ఉంది. అయితే ఇప్పుడు నవంబర్ 1 నుంచి వర్తించనున్నాయి. ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్యాష్ డిపాజిట్ ఛార్జీలను సవరించింది. నవంబర్ 1 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత ప్రతీ రూ.1,000 కి రూ.3.5 ఛార్జీ చెల్లించాలి. ప్రతీ ట్రాన్సాక్షన్‌కు కనీసం రూ.50 ఛార్జీ చెల్లించాలి. ఆకాశ ఎయిర్ కొత్త ఫెసిలిటీ తీసుకువచ్చింది. విమానంలో కూడా పెట్స్‌కు తీసుకుపోవచ్చు. నవంబర్ నుంచే ఈ కంపెనీ కార్గో సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎలక్ట్రిసిటి సబ్సిడీ అందుబాటులో ఉంది. ఢిల్లీలో ఇది వర్తిస్తుంది. సబ్సిడీ కోసం రిజిస్టర్ చేసుకోని వారికి నవంబర్ 1 నుంచి సబ్సిడీ పొందలేరు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కోసం ప్రజలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటును 30 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. పీఎన్‌బీ రేట్ల పెంపును గమనిస్తే.. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.05 శాతానికి చేరింది. ఇదివరకు ఎంసీఎల్ఆర్ రేటు 7.75 శాతంగా ఉంది. బ్యాంకులు సాధారణంగా ఏడాది ఎంసీఎల్ఆర్ రేటను రుణ రేట్లను నిర్ణయించడానికి ప్రామాణికంగా తీసుకుంటాయి. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఎంసీఎల్ఆర్ రేటును 15 బేసిస్ పాయింటలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 7.95 శాతానికి చేరింది. నవంబర్ 1 నుంచి రేట్ల పెంపు అమలులోకి వచ్చింది. ఇదివరకు ఎంసీఎల్ఆర్ రేటు 7.8 శాతంగా ఉండేది.

Leave A Reply

Your email address will not be published.