నిఫా వైరస్ తో 40-70 శాతం మరణాలు ఉంటాయి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్‌ మరోసారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఆరు పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. అందులో ఇద్దరు మృతి చెందగా.. ప్రస్తుతం 4 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, ఈ నిఫా వైరస్‌ కొవిడ్‌ (Covid-19) కంటే అత్యంత ప్రమాదకరమైందని భారతీయ వైద్య పరిశోధన మండలి తాజాగా హెచ్చరించింది.ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌ కేసుల్లో మరణాలు 2 -3 శాతం మాత్రమే ఉండగా.. నిఫా వైరస్‌లో 40 – 70 శాతం వరకూ ఉంటాయని తెలిపారు. కేరళలో ఈ నిఫా కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలియడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ వద్ద 10 మంది రోగులకు సరిపడా మాత్రమే మోనోక్లోనల్‌ యాంటీబాడీ మందు ఉందని తెలిపారు. మరో 20 డోసుల మందులను ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇన్ఫెక్షన్‌ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ మందు వాడాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అదేవిధంగా ఇప్పటికే విదేశాల్లో నిఫా బారిన పడిన 14 మంది రోగులకు మోనోక్లోనల్‌ యాంటీబాడీ మందును ఇచ్చారని, చికిత్స తర్వాత వారు పూర్తిగా కోలుకున్నట్లు ఆయన తెలిపారు.

 

కాగా, రాష్ట్రంలోని కోజికోడ్ ‌జిల్లాలో ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని 7 గ్రామాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి.. వైరస్‌ కట్టడికి చర్యలు చేపట్టారు. మరోవైపు ముందు జాగ్రత్తగా అక్కడి బ్యాంకులు, పాఠశాలలను, ఇతర కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ప్రస్తుతం వెలుగు చూసిన నిఫా వైరస్‌ బంగ్లాదేశ్‌ వేరియంట్‌ అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించగలదని తెలిపింది. వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ మరణాల రేటు అధికమని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీనాజార్జ్‌ తెలిపారు.

 

మెదడును అత్యంత తీవ్రంగా దెబ్బతీసే నిఫా వైరస్‌ను 1999లో తొలిసారి గుర్తించారు. మలేసియా, సింగపూర్‌లోని పందుల పెంపకందారుల్లో ఈ ఇన్‌ఫెక్షన్‌ బయటపడింది. ఇక దక్షిణ భారతదేశంలో తొలిసారి నిఫా వైరస్‌ కేసు మే 19, 2018లో కోజికోడ్‌ జిల్లాలోనే వెలుగుచూసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఈ వైరస్‌ నాలుగుసార్లు వ్యాప్తిలోకి వచ్చింది. ఈ వైరస్‌ కారణంగా 2018, 2021లో మరణాలు నమోదయ్యాయి. మొత్తం 23 మందికి ఈ వైరస్‌ నిర్ధారణ కాగా, అందులో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

ఎలా వ్యాపిస్తుంది..

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జంతువుల నుండి ప్రజలకు ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, ఈ వ్యాధి బారినపడిన వారి నుంచి ఇది నేరుగా మరో వ్యక్తికి సంక్రమిస్తుంది. ముఖ్యంగా తుంపర్లు, ముక్కు నుంచి, నోటి నుంచి వచ్చే ద్రవాల ద్వారా సోకుతుంది. ఈ వైరస్‌ లక్షణాలు తొందరగా బయటపడవు. ఈ వైరస్‌ కొందరిలో మెదడువాపుకు కారణమవుతుంది. ఒకసారి ఈ వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా 4 నుంచి 15 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి.

 

లక్షణాలు, చికిత్స?

 

వైరస్‌ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం, అలసట లాంటి లక్షణాలు ఉంటాయి. వైరస్‌ సోకిన వారిలో దాదాపు 75% మంది మరణించే అవకాశముంది. దీనికి ప్రత్యేకమైన చికిత్సగానీ, ఔషధాలుగానీ లేవు. కాబట్టి మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం

Leave A Reply

Your email address will not be published.