నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం

- ఆస్పత్రిలో స్ట్రెచర్ లేకపోవడంతో రోగిని కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుంటూ...

  తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో స్ట్రెచర్ లేకపోవడంతో ఓ రోగిని కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ స్పందించారు. రోగిపట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. ఆస్పత్రికి వచ్చిన రోగికి చికిత్స అందించే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. రోగిని వైద్య పరీక్షల కోసం రెండో అంతస్తుకు తీసుకెళ్లాల్సి ఉందని తెలిపారు. పేషేంట్ కేర్ సిబ్బంది వీల్ చైర్ తీసుకొచ్చేలోపే లిఫ్ట్ వచ్చిందని వారి తల్లిదండ్రులు రోగిని లాగుతూ తీసుకెళ్లారని వివరించారు. దీన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది రోగి బంధువులను వారించి.. రెండో అంతస్తులో పూర్తి వసతులతో డాక్టరుకు చూపించారన్నారు. ఇదంతా తెలియని ఓ వ్యక్తి వీడియో తీసి వైరల్ చేశారని తెలిపారు. ఈ సంఘటనకు, ప్రభుత్వ ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదని సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ స్పష్టం చేశారు.కాగా.. నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో గత నెల 31న ఓ రోగి చేరాడు. అయితే చికిత్స నిమిత్తం ఆస్పత్రి రెండో అంతస్తుకు వెళ్లాల్సి ఉండగా.. అక్కడ స్ట్రెచర్‌ లేక రోగిని బంధువులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. లిఫ్ట్‌ వరకు రోగి కాళ్లుపట్టుకుని బంధువులు లాక్కెళ్లారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోగిని ఆస్పత్రిలోకి తీసుకెళ్లేందుకు సిబ్బంది సాయం చెయ్యకపోవడంతో, ఆస్పత్రి సిబ్బంది తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. రోగులకు అందుబాటులో స్ట్రెచర్‌ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.