బీఎఫ్‌.7పై ఎలాంటి భ‌యాందోళ‌న‌లు అవ‌స‌రం లేదు

- ఏఐజీచైర్మ‌న్ డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి చైనాను గ‌డ‌గ‌డ వ‌ణికిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయా దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్‌ను అడ్డుకునేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అయితే ఈ వేరియంట్ భార‌త్‌లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌దు అని ఏఐజీచైర్మ‌న్ డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. కొవిడ్ వ్యాప్తి చైనాలో ఉన్నంత‌గా భార‌త్‌లో వ‌చ్చే అవ‌కాశం లేదు అని స్ప‌ష్టం చేశారు. చైనాలో ఇచ్చిన టీకాలు అంత నాణ్య‌మైన‌వి కావు అని పేర్కొన్నారు. చైనా కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు జీరో కొవిడ్ పాల‌సీ పాటించింది. ఇటీవ‌లే ఆంక్ష‌లు సడ‌లించ‌డంతో కేసులు పెరిగాయ‌ని పేర్కొన్నారు. బీఎఫ్‌.7 కేసులు భార‌త్‌లో అక్టోబ‌ర్‌లోనే వెలుగు చూశాయ‌ని గుర్తు చేశారు. బీఎఫ్‌.7 వేరియంట్ భార‌త్‌లో పెద్ద‌గా ప్ర‌భావం చూపద‌న్నారు. ఈ వేరియంట్ ఒక్క‌రి నుంచి 10 మందికి వ్యాపిస్తుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం దేశంలోని క‌రోనా కేసుల్లో 80 శాతం ఎక్స్‌బీబీ ర‌క‌మే అని పేర్కొన్నారు. వ‌చ్చే మూడేండ్ల వ‌ర‌కు ఏటా బూస్టర్ డోస్ తీసుకోవ‌డం మంచిద‌ని సూచించారు.భార‌త్‌లో ఒమిక్రాన్ స్ట్రెయిన్ స‌బ్ వేరియంట్‌ బీఎఫ్‌.7పై ఎలాంటి భ‌యాందోళ‌న‌లు అవ‌స‌రం లేద‌ని సీనియ‌ర్ శాస్త్ర‌వేత్త, బెంగ‌ళూర్‌కు చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ (టిగ్స్‌) డైరెక్ట‌ర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు. మ‌న జ‌నాభాపై దీని తీవ్ర‌త పెద్ద‌గా ఉండ‌బోద‌ని, అయితే ప్ర‌జ‌లు విధిగా మాస్క్‌లు ధ‌రించి, జ‌న‌స‌మ్మ‌ర్ధ ప్ర‌దేశాల‌కు దూరంగా ఉండ‌టం మంచిద‌ని సూచించారు. కాగా, నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు ఆపై పండుగ‌ల సీజ‌న్ కోసం కొవిడ్ నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేయ‌నుంది.

ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌పై మ‌న్సుఖ్ మాండ‌వీయ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతారు. మ‌రోవైపు న్యూ కొవిడ్ వేవ్ ముంచెత్తనుంద‌నే భ‌యాల న‌డుమ కేంద్రం గురువారం అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణీకుల కోసం నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. విమానాశ్ర‌యాల్లో విదేశాల నుంచి వ‌చ్చే వారికి స్క్రీనింగ్ నిర్వ‌హించాల‌ని, వైర‌స్ ల‌క్ష‌ణాలున్న‌వారిని క్వారంటైన్‌కు త‌ర‌లించాల‌ని అధికారుల‌ను ఆదేశించింది. వైర‌స్ వ్యాప్తి నేప‌ధ్యంలో ప్ర‌జ‌లు విధిగా మాస్క్‌లు ధ‌రించాల‌ని, అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని కోరింది.

Leave A Reply

Your email address will not be published.