ఇపుదు అందరి కళ్ళు సీబీఐపైనే కేంద్రీకృతం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇపుడందరి కళ్ళు సీబీఐపైనే కేంద్రీకృమయ్యున్నాయి. తాజా విచారణలో దర్యాప్తు సంస్ధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం ఉత్కంఠను పెంచేస్తోంది. దీనికి కారణం ఏమిటంటే వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కరరెడ్డిని విచారణకు రావాలని చెప్పటమే. ఎంపీని ఇప్పటికే రెండుసార్లు సీబీఐ దర్యాప్తు చేసింది. సోమవారం విచారణకు హాజరుకావాలని ఒకేసారి తండ్రి కొడుకులకు దర్యాప్తు సంస్ధ నోటీసులు జారీచేసింది.

ఎంపీనేమో హైదరాబాద్ లోని ఆఫీసులోను తండ్రినేమో కడప జైళ్ళ గెస్ట్ హౌస్ లో విచారించాలని సీబీఐ అధికారులు డిసైడ్ అయ్యారు. అయితే విచారణకు మరోతేదీని కేటాయించాలని ఎంపీ సీబీఐకి లేఖరాశారు. అధికారికంగా సీబీఐ రెస్పాన్స్ ఏమిటో తెలీలేదు. ఇక భాస్కర్ విచారణ మాత్రం సోమవారం జరుగుతుందనే అనిపిస్తోంది. వివేకా హత్యకేసులో వీళ్ళిద్దరే సూత్రదారులని సీబీఐ బలంగా అనుమానిస్తోంది. అయితే తనను కేవలం సాక్షిగా మాత్రమే విచారణకు పిలిచారని ఎంపీ చెప్పుకుంటున్నారు.

ఏదేమైనా ఎంపీ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఆయన తండ్రిని సీబీఐ ఏమి చేయబోతోందనే ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇద్దరి అరెస్టు ఖాయమని కాకపోతే ముందు భాస్కరరెడ్డిని అదుపులోకి తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు సీబీఐ విచారించిన అనేక కేసుల్లో అనుమానితులను ఇలాగే ఒకటికి రెండుమూడుసార్లు విచారణకు పిలిపించి తర్వాత అరెస్టు చేసిన ఘటనలున్నాయి. కాబట్టి ఎంపీ ఆయన తండ్రి విషయంలో కూడా ఇదే పద్దతిని దర్యాప్తుసంస్ధ అనుసరించబోతోందని సమాచారం.

అయితే వీళ్ళ అరెస్టుకు సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో అర్ధంకావటంలేదు. బలమైన ఆధారాలు లేకుండా ఊరికే అరెస్టంటే అది కోర్టులో నిలవదన్న విషయం అందరికీ తెలిసిందే. గూగుల్ టేకౌట్ అయినా మరోటైనా కోర్టులో పక్కాగా నిలబడాలంటే ప్రవేశపెట్టే ఆధారాలు తిరుగులేనివయ్యుండాలి. వివిధ కేసుల్లో సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టిన అనేక ఆధారాలను కోర్టులు కొట్టిపారేసిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కాబట్టి బలమైన ఆధారాలను సేకరించినపుడే సీబీఐ పెట్టే కేసులు ఛార్జిషీట్లు కోర్టులో నిలబడతాయి. లేకపోతే కక్షసాధిస్తోందనే అపవాదును సీబీఐ మోయాల్సిందే తప్పదు.

Leave A Reply

Your email address will not be published.