ఓబీసీ రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలకు వెళ్లాలి

- అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉత్తరప్రదేశ్‌ పురపాలక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అలహాబాద్ హైకోర్టు మంగళవారంనాడు సంచలన తీర్పు చెప్పింది. ఓబీసీ రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలకు వెళ్లాలంటూ ఆదేశించింది. ఓబీసీ రిజర్వేషన్లపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 5న జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో ఓబీసీ రిజర్వేషన్ల ప్రసక్తి లేకుండా యూపీ అర్బన్ బాడీ పోల్స్‌ నిర్వహణకు మార్గం సుగమమైంది. జస్టిస్ డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ సౌరవ్ లావణ్యతో కూడిన ధర్మాసం ఈ ఆదేశాలు ఇచ్చింది.ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 5న జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వాజ్యం పై కోర్టు ఈ తాజా తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను ఓబీసీ రిజర్వేషన్ డ్రాప్ట్ పాటించలేదని ఆ పిల్ పేర్కొంది. కాగా, హైకోర్టు తాజా తీర్పుతో ఓబీసీలకు రిజర్వ్ చేసిన సీట్లను ఇప్పుడు జనరల్ కేటగిరిగా పరిగణిస్తారు. దీంతో ఎవరైనా సరే ఈ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఎస్‌సీ, ఎస్‌టీ సీట్లలో మాత్రం రిజర్వేషన్ యథాప్రకారం కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయని పక్షంలో జనవరిలో యూపీ అర్బన్ బాడీ పోల్స్ జరుగుతాయి.

తీర్పును పరిశీలిస్తాం: కేశవ్ ప్రసాద్ మౌర్య

అలహాబాద్ హైకోర్టు తీర్పుపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందిస్తూ, తీర్పును కూలంకషంగా అధ్యయనం చేస్తామని, ఆ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే, వెనుకబడిన తరగతుల హక్కుల విషయంలో ఎలాంటి రాజీ లేదని అన్నారు.

బీజేపీపై సమాజ్‌వాదీ పార్టీ విసుర్లు

వెనుకబడిన తరగతుల వారిని బీజేపీ వంచిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ ఆక్షేపించింది. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసేందుకు బీజేపీ ఉద్దేశపూర్వకంగానే కుట్రలు సాగిస్తోందని ఆరోపించింది.

Leave A Reply

Your email address will not be published.