తిరుమల కొండపై పారిశుధ్య పనుల్లో నిమగ్నమైన అధికారులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఒకరు నిత్యం తిరుపతి జిల్లా పాలనా వ్యవహారాలతో బిజీగా ఉండే కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి. మరొకరు తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులకు దర్శనాలు, ఇతర సౌకర్యాలు కల్పించడంలో హడావుడిగా ఉండే టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వీరిద్దరూ ఆదివారం చీపురు పట్టారు. మానవ సేవే మాధవ సేవగా భావించి శ్రీవారి దర్శనార్థం తిరుమల కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొండపై పారిశుధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. పారిశుధ్య కార్మికుల్లా మారి రోడ్లు ఊడ్చి, చెత్త ఎత్తారు. ఈవో అయితే మరుగుదొడ్లనూ శుభ్రం చేశారు.

సులభ్‌ కార్మికుల సమ్మె కారణంగానే..

తమ సమస్యలు పరిష్కరించాలంటూ తిరుమలలో పనిచేసే దాదాపు 1,600 మంది సులభ్‌ కార్మికులు ఏప్రిల్‌ 22వ తేదీ నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దాంతో వారం రోజులుగా తిరుపతి కార్పొరేషన్‌లో పనిచేసే ఉద్యోగులతోనే పారిశుధ్య పనులను టీటీడీ చేయిస్తోంది. అయితే సంస్థ ప్రతిష్టను కాపాడుతూ భక్తులకు ఇబ్బంది లేకుండా పారిశుధ్య పనుల్లో పాల్గొందామన్న ఈవో పిలుపుతో కలెక్టర్‌తోపాటు జేఈవోలు వీరబ్రహ్మం, సదాభార్గవి, సీవీఎస్వో నరసింహ కిషోర్‌తోపాటు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు కూడా ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పారిశుధ్య పనుల్లో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.