నాడు ప్రత్యర్థులు..నేడు ఫాలోవర్లు..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కేసీఆర్‌పై పోటీ చేసిన వారిలో ఎనిమిది మంది మహామహులు ఆ తర్వాత కేసీఆర్‌తో కలిసిపోయారు. వారేమి ఆశామాషీ వ్యక్తులు కాదు. రాజకీయాల్లో అందరూ తమదైన ముద్ర వేసినవారే. 1983లో సిద్దిపేట బీజేపీ అభ్యర్థిగా కేసీఆర్‌పై పోటీ చేసిన నిమ్మ నర్సింహారెడ్డి నుంచి మొదలుకొని 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన వంటేరు ప్రతాప్‌రెడ్డి వరకు అందరూ కేసీఆర్‌తో కలిసి నడుస్తున్నారు.

నిమ్మ నర్సింహారెడ్డి

1983లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నిమ్మ నర్సింహారెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి, తన రాజకీయ గురువు అనంతుల మదన్‌మోహన్‌ చేతిలో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అనంతర కాలంలో తెలంగాణ సాధన కోసం నిమ్మ నర్సింహారెడ్డి సైతం కేసీఆర్‌ వెంట నడిచారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పురుడు పోసుకున్నప్పుడు కేసీఆర్‌తో పాటు ఉన్న కొద్దిమంది మిత్రులు, మేధావుల్లో నిమ్మ నర్సింహారెడ్డి కూడా ఒకరు.

మారెడ్డి శ్రీనివాసరెడ్డి

తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ టీడీపీ సభ్యత్వానికి, శాసనసభకు, డిప్యూటీ స్పీకర్‌ పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. దీంతో 2001లో సిద్దిపేట ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేసీఆర్‌ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కొద్దికాలానికే మారెడ్డి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌)లో చేరారు.

జిల్లా శ్రీనివాస్‌

టీఆర్‌ఎస్‌ను స్థాపించిన తర్వాత 2004లో సిద్దిపేట నుంచి కేసీఆర్‌ పోటీ చేయగా.. టీడీపీ అభ్యర్థిగా జిల్లా శ్రీనివాస్‌ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ 44,668 భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత జిల్లా శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఎం స్వామిచరణ్‌

1999లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎం స్వామిచరణ్‌ పోటీ చేశారు. ఆయనపై కేసీఆర్‌ 27,555 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మలిదశ ఉద్యమం మొదలయ్యాక టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఎల్‌. రమణ

2006లో టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయగా కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కేసీఆర్‌పై టీడీపీ అభ్యర్థిగా సీనియర్‌ నేత ఎల్‌ రమణ బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2,10,582 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. 2021లో బీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్‌ రమణకు కేసీఆర్‌ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.

వంటేరు ప్రతాప్‌ రెడ్డి

2014, 2018లోనూ గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి 2019లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రతాప్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కేసీఆర్‌ నియమించారు.

చాగన్ల నరేంద్రనాథ్‌

2014లో మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌పై బీజేపీ తరఫున చాగన్ల నరేంద్రనాథ్‌ బరిలో నిలిచారు.. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు.

Leave A Reply

Your email address will not be published.