పవన్ కళ్యాణ్ హౌస్ అరెస్ట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకులు తప్పడం లేదు. విశాఖ టూర్ తర్వాత పవన్ ను టార్గెట్ చేస్తున్న పోలీసులు ఇవాళ మరోసారి విశ్వరూపం చూపుతున్నారు. నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతల్ని నిరసిస్తూ ఇవాళ అక్కడ పర్యటించేందుకు పవన్ సిద్ధమయ్యారు. అయితే దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఉదయం ఇప్పటం గ్రామానికి వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ నిన్న రాత్రే మంగళగిరి చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఇప్పటం బయలుదేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే పోలీసులు మాత్రం ఆయన్ను మంగళగిరి జనసేన కార్యాలయం నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్దితులు తలెత్తాయి. విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు అపసోపాలు పడ్డారు. అనంతరం పవన్ కళ్యాణ్ వాహనాల్లో కాకుండా నేరుగా నడుచుకుంటూ మంగళగిరి నుంచి ఇప్పటం బయలుదేరారు. మంగళగిరి జనసేన కార్యాలయం నుంచి ఇప్పటం గ్రామానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ జనసేన కార్యకర్తలతో కలిసి నిన్న అధికారులు కూల్చేసిన ఇళ్లను పరిశీలిస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో అధికారులు పలు ఇళ్లను కూల్చేశారు. దీనిపై జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణ జరిపిన హైకోర్టు.. కూల్చివేతలు ఆపాలని ఆదేశాలు ఇచ్చింది. అంతకు ముందు జనసేన మీటింగ్ కోసం స్ధలం ఇచ్చిన ఇప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించారు. ఈ మొత్తం సీఆర్డీయేకు ఇవ్వాలని అధికారులు పట్టుబట్టారు. దీనికి గ్రామస్తులు, జనసేన కూడా ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో కూల్చివేతల పర్వం ప్రారంభం కావడం విమర్శలకు తావిచ్చింది.

Leave A Reply

Your email address will not be published.