11 రోజులపాటు దీక్షకు పూనుకున్న పవన్ కళ్యాణ్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌ మంగళవారం వారాహీ అమ్మవారి దీక్షకు శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయాన్నే వారాహీ అమ్మవారి ఆరాధనతో దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అలాగే, సంధ్యా సమయంలోనూ వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఇలా 11 రోజుల పాటు వారాహీ అమ్మవారి దీక్షలో ఉంటారు పవన్‌ కల్యాణ్‌. జులై 1 నుంచి పిఠాపురం టూర్…  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ జులై 1వ తేదీ నుంచి తన నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. అదేరోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. మూడు రోజులపాటు పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాకినాడ జిల్లా అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు.  29వ తేదీన కొండగట్టుకు…  పదకొండు రోజుల పాటు వారాహీ అమ్మవారి దీక్షలో ఉండనున్న పవన్‌ కల్యాణ్‌…. పలు ఆలయాలను సందర్శించనున్నారు. తన ప్రచార రథం వారాహీకి తొలి పూజ నిర్వహించిన తెలంగాణలోని కొండగట్టు ఆలయాన్ని సందర్శంచనున్నారు. ఈ నెల 29న కొండగట్టు ఆలయానికి చేరుకోనున్న పవన్‌ కల్యాణ్‌… అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  ఇటీవల ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించింది. వంద శాతం స్ట్రైక్‌ రేట్‌తో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో 70వేల పైచిలుకు ఆధిక్యంతో విజయ దుందుభి మోగించారు. జనసేన నుంచి పవన్‌ కల్యాణ్‌ సహా ముగ్గురికి చంద్రబాబు కేబినెట్‌లో పదవులు దక్కాయి. పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడంతో పాటు ఐదు కీలక శాఖలకు మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో వారాహీ అమ్మవారికి మొక్కు చెల్లించేందుకు పవన్‌ కల్యాణ్‌ దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు దీక్షలో ఉండనున్న పవన్‌… పాలు, పండ్లు లాంటి తేలికపాటి ఆహారం తీసుకుంటారు. ఇప్పటికే దీక్ష చేపట్టిన ఆయన… కాషాయ వస్త్రాలు ధరించారు. ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమంతో పాటు ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు అదే లుక్‌లో హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.