జగన్ ప్రభుత్వం నుండి బకాయిలు ఇప్పించండి

- గవర్నర్ కు విన్నవించినా ఉద్యోగ సంఘాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డీఏ, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇప్పటికీ అందడం లేదు. దీనిపై ప్రభుత్వం గతంలో పలుమార్లు హామీలు ఇచ్చినా డబ్బులు మాత్రం రాలేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ ను ఆశ్రయించారు. ప్రభుత్వం నుంచి పెండింగ్ బకాయిలు ఇప్పించాలని కోరారు.

రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆరోపిస్తోంది. అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ, అనేక సమావేశాలలో డిమాండ్ చేసినప్పటికీ ఫలితం శూన్యమని ఉద్యోగుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారాలు గల గవర్నర్ ను కలసి ఈ అంశం నివేదించాలని నిర్ణయించింది.ఈ మేరకు ఇవాళ ఉద్యోగ సంఘం నేతలు విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వేల కోట్ల బకాయిలు తక్షణం చెల్లించేలా జోక్యం చేసుకోవాలని కోరుతూ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి. ఆస్కార్ రావు ఆధ్వర్యంలో మొత్తం 8 మంది ప్రతినిధులు ఇవాళ గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోయినా అధికారులు స్పందించడం లేదని, గతంలో ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని ఉద్యోగ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. తక్షణం జోక్యం చేసుకుని తమ బకాయిలు ఇప్పించాలని వారు కోరారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు నేతలు చెప్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.