చలి తీవ్రతకు గజగజలాడుతున్నా జనాలు

-  కనిష్ఠ స్థాయికి పడిపోయిన ఉష్ణోగతలు            - హైపోథర్మియాతో జర జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హెచ్చరిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉదయం 10 గంటలైనా వీడని చలి  పగటిపూట కూడా శరీరం పగిలే శీతల గాలులు ఇక రాత్రైతే దుప్పటి ముసుగుతీయలేని గజగజ పరిస్థితి.. ఇవీ తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులు. డిసెంబర్‌లో కొనసాగిన ఉక్కపోత ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం రాత్రి పెరిగిన చలి ఆదివారం మరింత ఎక్కువైంది. జనాలు గజగజ వణికిపోతున్నారు. చలి తీవ్రతోపాటు దట్టంగా కురుస్తున్న మంచుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తర భారతం నుంచి వీస్తున్న తీవ్ర శీతలగాలులు ఇక్కడి చలికి కారణమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌ నుంచి ఆసిఫాబాద్‌ వరకు చలి తీవ్రతకు జనాలు గజగజలాడుతున్నారు. చాలా జిల్లాల్లో ఉష్ణోగతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఆదివారం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యు) మండలంలో 4.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో ఇదే అత్యల్పం. ఇక హైదరాబాద్‌లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రత 12.8 డిగ్రీలకు దిగజారింది. అనేక ప్రాంతాల్లో కూడా 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇవే పరిస్థితులున్నాయి. చాలా జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి, హుకుంపేట, జి.మాడుగుల మండల కేంద్రాలతో పాటు ఆంధ్ర కశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగిలోనూ ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు నమోదయింది. మరో రెండు మూడు రోజుల వరకు ఈ శీతల గాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ మండలాల్లో చలి విపరీతంగా ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో అతిశీతల వాతావరణం నుంచి రక్షణ పొందేందుకు నిపుణులు పలు సలహాలు-సూచనలు ఇస్తున్నారు. హైపోథర్మియాతో జర జాగ్రత్త !

విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వ్యక్తులు ఎవరైనా అల్పోష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ముప్పు పొంచివుంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే అల్పోష్ణస్థితిగా (Hypothermia) పేర్కొంటారు. ఈ పరిస్థితికి గురయ్యే వ్యక్తులు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కింద పేర్కొన్న లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలపై అవగాహన ఉండడం ఎందుకైనా మంచిది.

లక్షణాలు..

  1. వణుకు (Shivering)
  2. అమోమయం (Confusion)
  3. మాట్లాడడంలో ఇబ్బంది (Difficulty speaking)
  4. మగత(నిద్రమబ్బు వీడకపోవడం) (Drowsiness)
  5. కండరాలు పట్టేయడం (Stiff muscles)

పసికందులు, పిల్లల్లో ఇవీ లక్షణాలు..

  1. శరీర ఉష్ణోగ్రత97.5 ఫారెన్‌హీట్ కంటే తక్కువకు పడిపోవడం.
  2. సాధారణంగా భిన్నంగా ఏడవడం(Weak cry).
  3. బద్ధకం (lethargy)
  4. శరీరంపై ఎర్రటి దద్దుర్లు,వాపు (Cold red skin)
  5. శ్వాస తీసుకోవడం ఇబ్బందులు (Labored breathing)
  6. తినలేకపోవడం,తాగలేకపోవడం (Unable to eat and drink).

నివారణ మార్గాలివే..

  1. ఇంటి వెలుపల అతిశీతల వాతావరణంలో ఎక్కువ సమయం గడపొద్దు. ఒకవేళ బయటకు వెళ్లినా ఎక్కువసేపు ఉండకపోవడం ఉత్తమం.
  2. తక్కువగా బరువుతో వదులుగా,వేడిగా ఉంచే దుస్తులు ధరించాలి.
  3. బ్లడ్ సర్క్యూలేషన్‌ను తగ్గించే అవకాశమున్న బిగుసు దుస్తులు ధరించ వద్దు.
  4. చెవులు,ముఖం, చేతులు, పాదాలను రక్షించుకోండి. హ్యాట్, గ్లోవ్స్, బూట్లు ధరించి రక్షణ పొందొచ్చు.
  5. విపరీతమైన చలి నుంచి ఊపిరితిత్తుల రక్షణ కోసం ముఖాన్ని కవర్ చేసుకోవాలి
  6. ద్రవ పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. నాన్-ఆల్కాహాల్,కేఫిన్ రహిత ద్రవపదార్థాలు తాగాలి.
  7. ఇతర వైద్యపరమైన ప్రమాణాలను పాటించాలి.
Leave A Reply

Your email address will not be published.