తెలంగాణలో వరద బాధితుల సహాయ చర్యలపై హైకోర్టు లో పిల్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణలో వర్షాలు వద్దంటే దంచికొట్టాయి.! శుక్రవారం కాస్త గ్యాప్ ఇవ్వడంతో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా భాగ్యనగర ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ వర్షాలతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నిచోట్ల వరద బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో వరద సహాయక చర్యలపై రాష్ట్ర అత్యున్న న్యాయస్థానం హైకోర్టులో సీనియర్ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ పిల్ వేశారు. దీనిపై శనివారం న్యాయస్థానం విచారణ జరిపింది.వరద బాధితుల సహాయ చర్యలపై నివేదిక ఇవ్వండి. వరద ప్రాంతాల్లో ఏం చర్యలు తీసుకున్నారో కోర్టుకు తెలపండి. వరదల్లో ఎంత మంది మరణించారు..? ఆ కుటుంబాలకు పరిహారం చెల్లించారా..?. ముంపు ప్రాంతాల నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారా..? లేదా..?. పునరావాస కేంద్రాల్లో ఎలాంటి సదుపాయాలు కల్పించారో తెలపండి. వరదలపై పర్యవేక్షణ, సాయం కోసం కంట్రోల్ ఏర్పాటు చేశారా?. ఈనెల 31 వరకు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలి’ అని కేసీఆర్ సర్కార్‌పై హైకోర్టు పలు ప్రశ్నలు సంధిచడమే కాకుండా కీలక ఆదేశాలు సైతం జారీచేసింది. ఎన్నికల కోసం వార్ రూమ్‌లు ఏర్పాటు చేస్తారు కదా..? మరి.. వరదల కోసం వార్‌రూమ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు..? అని న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. ప్రాజెక్టుల పరిసర ప్రజలు భయాందోళనలతో ఉన్నారని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు వినిపించారు. డ్యామ్ పరిరక్షణ చట్టానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే.. ప్రభుత్వం నివేదికలో ఏం చెబుతుందా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.